జిల్లాలో బాల్య వివాహాలు జరుగకుండా ముందస్తు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

జిల్లాలో బాల్య వివాహాలు జరుగకుండా ముందస్తు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే, 3వ తేదీన అక్షయ తృతీయ పెళ్లి ముహుర్తాలు ఉన్నాయని ఆ రోజు జిల్లాలో సామూహిక వివాహాలు సైతం జరుగుతాయన్నారు. ఈ సందర్బంగా ఏ ఒక్క బాల్య వివాహం జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల్లో పంచాయతి సెక్రెటరీలకు తెలియకుండా ఏ పెళ్లి జరగదని ఎక్కడైనా బాల్య వివాహం జరిగినట్లు తెలిస్తే పంచాయతి సెక్రెటరీ పై చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా చైల్డ్ ప్రొటెక్షన్ సిబ్బంది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మధ్య స్కూల్ డ్రాపవుట్ పిల్లలు ఎవరు ఉన్నారో మండలం వారిగా నివేదికను జిల్లా సంక్షేమ శాఖకు అందజేయాలని ఆదేశించారు. పురోహితులు ఎవరూ బాల్య వివాహాల్లో పాల్గొనవద్దని, ఒకవేళ వివాహం చేయిస్తే మాత్రం కేసులు పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పి.ఎం. కేర్ పథకం కింద అనాధ బాలలకు 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం తో పాటు హెల్త్ కార్డు జారీ చేస్తారని జిల్లాలో అర్హులైన అనాధ పిల్లలను గుర్తించి ఈ పథకం అందేవిధంగా చూడాలని సి.డి.పి.ఓ ను ఆదేశించారు. బాలరక్ష భవన్ లో ఉన్న 55 మంది అనాధ పిల్లలకు కుల ధ్రువీకరణ, ఆదాయం సర్టిఫికెట్లు తీయించి ఇవ్వాలని అవి ఏ స్థాయిలో పెండింగ్ లో ఉన్నాయో తెలుసుకోవాలని ఆదేశించారు. అనంతరం పిల్లల సంరక్షణ పై రూపొందించిన గోడ పత్రికను విడుదల చేసారు.
ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి( ఇంచార్జి ) దమయంతి, సి.డి.పి.ఓ. నిరంజన్, డి.పి.ఓ కృష్ణ, డి.ఆర్.డి.ఓ నర్సింగ్ రావు, ఏ.పి.డి రాజేశ్వరి, అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జామినేషన్ రాజశేఖర్ రావు, ఏ.బి.సి.డి.ఓ శ్రీధర్ రెడ్డి, ఎన్జీఓ రాజశేఖర శర్మ, సి డి.పి.ఓ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post