జిల్లాలో భారీ వర్షాలు – అదుపులోనే పరిస్థితులు – ప్రజలు బయటకు వెళ్ళవదు – ప్రభుత్వం, యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నది – ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ఎస్ ఆర్ ఎస్ పి (నిజామాబాద్), సెప్టెంబర్ 28:– గులాబ్ తుఫాన్ ప్రభావం వల్ల జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసినప్పటికీ కొంతమేర పంట నష్టం మినహా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

సోమవారం నుండి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి ఆకస్మికంగా హైదరాబాద్ నుండి మంగళవారం నాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా అధికారులు, ప్రాజెక్టు అధికారులు, ఆర్డీవో తో సమీక్షించుకున్నారు. గులాబ్ తుఫాన్ వల్ల జిల్లాలో విపరీతంగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి అని అక్కడక్కడ రోడ్లు కొంతమేర దెబ్బతిన్నాయని కొన్నిచోట్ల పంట పొలాల్లో నీరు చేరడం వల్ల పంటలకు కొంత మేర నష్టం జరిగిందని అధికారులతో వాటిని అంచనా వేయించి ప్రభుత్వానికి నివేదిస్తామని దేవుని దయవల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పరిస్థితి పూర్తిగా యంత్రాంగం అదుపులో ఉన్నదని అధికారులందరూ వారి వారి స్థాయిలో అప్రమత్తంగా ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నందున ప్రజలు తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్ళవద్దని ఆయన పేర్కొన్నారు.

శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ కు గోదావరి, నిజాంసాగర్, కౌలాస్ నాలా నుండి సుమారు మూడున్నర లక్షల క్యూసెక్కులకు పైగా మీరు ఇన్ఫ్లో వస్తున్నదని దానికి సమానంగా ప్రాజెక్టు నుండి క్రిందికి వదులుతున్నారని ఆయన తెలిపారు. కందకుర్తి వద్ద హంగర్గ తదితర ప్రాంతాల్లో పొలాల్లోకి నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారని మూడు రోజులపాటు అసెంబ్లీ కార్యక్రమాలను రద్దు చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలో ఉండి ఎప్పటికప్పుడు అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారని వారి ఆదేశాల ప్రకారం తాను నేరుగా పోచంపాడుకు వచ్చినానని మరో రెండు రోజులు ఇక్కడే ఉండి పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అధికారులకు తగు సూచనలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రాజెక్టులు చెరువులు కెనాల్స్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ కూడా మనుషులకు మూగజీవాలకు ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గ్రామస్థాయి అధికారులతో పాటు ఉ మండల స్థాయిలో తహసీల్దార్లు ఎంపీడీవోలు సహాయ ఇంజనీర్లు వారి స్థానాల్లోనే ఉండి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ప్రజలు కూడా ఎక్కడైనా సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు.

మంత్రి వెంట ప్రాజెక్టు ఎస్ ఈ శ్రీనివాస్, ఈఈ చక్రపాణి, ఆర్మూర్ ఆర్డిఓ శ్రీనివాస్, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Share This Post