జిల్లాలో మన ఊరు- మనబడి, మన బస్తీ-మనబడి కింద చేపడ్తున్న పాఠశాలల అభివృద్ధి పనులను పాఠశాలల పున: ప్రారంభంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

మే,07 ఖమ్మం:

జిల్లాలో మన ఊరు- మనబడి, మన బస్తీ-మనబడి కింద చేపడ్తున్న పాఠశాలల అభివృద్ధి పనులను పాఠశాలల పున: ప్రారంభంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. మన ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఇప్పటికే సిద్ధం చేసిన అంచనాల ప్రకారం క్షేత్రస్థాయిలో పనుల అవసరాలను, పనులు చేపట్టే పాఠశాల ఆవరణలోని స్థలాలను శనివారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్, తెట్టారుపల్లి, తల్లంపాడు జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలను శనివారం కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను బట్టి, విద్యార్థుల అవసరాలను గుర్తించి అదనంగా అవసరమయిన మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం, కిచెన్ షెన్స్, డైనింగ్ హాల్స్, ప్రహారీ గోడ ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు తరగతి గదులు సరిపోక చెట్ల క్రింద కూర్చుంటున్న పాఠశాలలో అదనపు తరగతి గదులను ఏర్పాటు చేయాలని, తదనుగుణంగా అవసరమైన యెడల సవరణ అంచనాలను సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ సూచించారు. సాధ్యమైనంత మేర విద్యార్థులకు ఆటస్థలాలకు ఖాళీ ప్రదేశాన్ని కేటాయించాలని, నూతనంగా నిర్మించనున్న డైనింగ్ హాల్స్ ను భవనం అంతస్తులపై ఏర్పాటు చేయడం ద్వారా భవన స్లాబ్ లీకేజీలు తదితర సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రహారీ గోడలు లేని పాఠశాలలకు తప్పనిసరిగా ప్రహరీ ఏర్పాటుకు అంచనాలలో చేర్చాలని, విద్యార్థిని, విద్యార్థులకు విడి విడిగా మరుగుదొడ్లు ఉండేలా, ప్రస్తుతం ఉన్న వాటితో పాటు, అదనంగా అవసరం ఉన్న యెడల తప్పనిసరిగా నీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్లు ఏర్పాటు, చేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఆవరణలో లేదా సమీపంలో గల మండల పరిషత్ పాఠశాలలను విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమయిన యెడల ఒకే ప్రాంగణంలో ఉండేలా అదనపు తరగతి గదులకు ప్రాతిపాదించిన అంచనాలను సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. తరగతి గదులలో ఫ్లోరింగ్ పనులను అవసరాల మేరకు మాత్రమే చేపట్టాలని, నాణ్యతతో ఉన్న ఫ్లోరింగ్ పనులను తిరిగి చేపట్టడం వల్ల సమయం, నిధులు వృధా అవుతాయని వీటిని దృష్టిలో ఉంచుకొని ఇంజనీరింగ్ అధికారులు పనుల అంచనాలను సవరించాలని కలెక్టర్ సూచించారు. తల్లంపాడు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్.ఎం.ఎస్ నిధులు 50 లక్షలతో చేపడ్తున్న ఐదు అదనపు తరగతి గదుల పనులను పాఠశాల పునః ప్రారంభంమయ్యేలోగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం తల్లంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ పనుల పురోగతిని పరిశీలించారు. దీనితో పాటు మన ఊరు మనబడి, మనబస్తీ మనబడి కింద పాఠశాలకు అవసరమైన పనులను మాత్రమే చేపట్టాలని, పూర్తి ఇంగ్లీషు మాధ్యమంలో నిర్వహించబడుచున్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచాలని కలెక్టర్ విద్యాశాఖాధికారులనుఆదేశించారు.

మండల విద్యాశాఖాధికారి శ్రీనివాస్, టి.ఎస్.ఈ. డబ్ల్యూ ఐ.డి.సి ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు జె. నాగశేషు, ఏ.ఎన్.సురేందర్ రెడ్డి, ఎం.పి.డి.ఓ అశోక్, తహశీల్దార్ టి. సుమ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అజిత, తెల్దారుపల్లి, సర్పంచ్ కోటయ్య, హెచ్.ఎంలు యల్. పద్మావతి, రాంకోటి రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share This Post