జిల్లాలో మలేరియా నియంత్రణ దిశగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

జిల్లాలో మలేరియా, ఇతరత్ర విషజ్వరాల నియంత్రణ దిశగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు.
నేడు ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయా ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ కేంద్ర కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీని కలెక్టర్ ప్రారంభించి, గోడప్రతులు, కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దోమల ద్వారా మలేరియా, బోదకాలు, మెదడు వాపు, చికెన్ గున్యా ఇతరత్రా వ్యాధులు వ్యాప్తి చెందుతాయని అన్నారు. ఇండ్లు, ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు, చెత్తాచెదారం నిల్వచేయడం, అపరిశుభ్ర వాతావరణంలో దోమలు వృద్ధి చెందుతాయని, ఈ నేపథ్యంలో ఇంటి పరిసరాలు, ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓవర్ హెడ్ ట్యాంకులు, డ్రమ్ములు, సంపు లపై మూత వేసి ఉంచాలని తెలిపారు. ప్రజలు దోమతెరలు వినియోగించాలని, నీటి నిలువ ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ ఉపయోగించి దోమల వృద్ధిని అరికట్టాలని తెలిపారు. గ్రామాలలో రోడ్లు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, చెత్తాచెదారం నిల్వ ఉంచరాదని తెలిపారు.
పారిశుధ్య నిర్వహణ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, వ్యాధులు ప్రబలి నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేయడంతో పాటు అవగాహన సదస్సులు, ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని, ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ లాల్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ వెంకట్ దాస్, రెడ్ క్రాస్ కార్యదర్శి రమేష్ రెడ్డి, జిల్లా ప్రోగ్రాం అధికారి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post