జిల్లాలో రైతులు యాసంగిలో వరి వేయవద్దని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు.

యాసంగిలో వరి వద్దు… ప్రత్యామ్నాయ పంటలే మేలు…. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

జిల్లాలో రైతులు యాసంగిలో వరి వేయవద్దని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు.

సోమవారం కలెక్టర్ చౌటకూర్ , ఆందోల్ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతులతో నేరుగా మాట్లాడి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు. యాసంగి లో కేంద్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం లేదని తెలిపారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయదని తెలిపారు. రైతులు తమ స్వంత అవసరానికి తిండిగింజల కోసం, మిల్లర్లు, సీడ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు మాత్రమే ధాన్యం వేసుకోవాల అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు.రైతులు తెలిసి తెలియక వరి వేసి నష్టపో వద్దన్నారు.
యాసంగి లో ప్రత్యామ్నాయ పంటల సాగుతో అధిక దిగుబడితో లాభం చేకూరుతుందని అన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా లాభదాయకమైన ఆరుతడి పంటలను వేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

యాసంగి లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులను చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రైతులకు వేసుకో బోయే యాసంగి పంట గురించి స్పష్టమైన అవగాహన ఉందన్నారు. జిల్లాలో ఇప్పటికే వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రతి రైతును చైతన్య పరుస్తున్నారని పేర్కొన్నారు.

అధికారులు మొదలుకొని ప్రజాప్రతినిధుల వరకు ప్రతి రైతుకు యాసంగిలో వరి వేయవద్దని, ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లేలా అవగాహన కల్పించాలన్నారు. ఏ ఒక్క రైతు కూడా తెలియక యాసంగి లో వరి వేసి నష్టపో వద్దన్నారు.

జిల్లాలో కొనుగోలు కేంద్రాలు సజావుగా కొనసాగుతున్నాయని, ఇప్పటికే 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. రైతుల ఖాతాల్లో 72 గంటల్లో డబ్బులు పడుతున్నాయని, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

చౌటకూర్ మండలం ఉప్పర గూడకు చెందిన రైతు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు యాసంగిలో వరి వేయబోమని నిర్ణయం తీసుకున్నామని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటామని, తిండి గింజల వరకు మాత్రమే వేసుకోనున్నట్లు కలెక్టర్కు తెలిపారు.

అందోల్ మండలం సంగు పేట కొనుగోలు కేంద్రంలో ధాన్యం నాణ్యతను పరిశీలించి రైతులతో కలెక్టర్ మాట్లాడారు. ఏసమ్మ అనే మహిళా రైతును ఎన్ని ఎకరాల భూమి ఉంది, కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతున్నాయి? మరి యాసంగి సంగతేంటి? అంటూ ఆరా తీశారు. యాసంగి లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని మీకు తెలిసిందా? అని అడిగారు. వేరే పంటల వైపు పోవాలని, తెలిసి తెలియక వేసుకుని నష్ట పోవద్దని సూచించారు.
జిల్లాలోని చివరి రైతు వరకు యాసంగిలో వరి వేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని విస్తృత అవగాహన కల్పించాలన్నారు.

అనంతరం యాసంగి లో ఇతర పంటల సాగు కు సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి నరసింహారావు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, తహసీల్దార్లు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post