ప్రచురణార్ధం
జూలై,30 ఖమ్మం
జిల్లాలో లే అవుట్ ఆడిటి పకడ్బందీగా జరగాలని, అక్రమ లేఅవుట్, వెంచర్లపై చర్యలు తీసుకోవాలని, ఆథరైజ్డ్ లే అవుట్లు, ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా జిల్లా స్థాయి లేఅవుట్ కమిటీ పనిచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి లే అవుట్ కమిటీ సమావేశంలో అనుబంధ శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత జిల్లా స్థాయి అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు, ఆదేశాలు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన మున్సిపల్ చట్టం ప్రకారం ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులననుసరించి జిల్లా స్థాయిలో లే అవుట్ ఆమోదం కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, నూతన మార్గదర్శకాలననుసరించి మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ద్వారా జిల్లా స్థాయి కమిటీకి ఆమోదానికి పంపబడిన లే అవుట్లకు సంబంధించి, సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, సమగ్ర నివేదికలను సమర్పించాలని, తదనంతరం మాత్రమే అనుమతులు జారీ చేయబడతాయని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ, పంచాయితీరాజ్, నీటిపారుదల, ఆర్ అండ్ బి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, మున్సిపల్ కమీషనర్లు, జిల్లా పంచాయితీ అధికారులు, సర్వేల్యాండ్ రికార్డ్స్, జిల్లా రిజిస్ట్రార్, విద్యుత్ శాఖతో పాటు ఖమ్మం టౌన్ ప్లానింగ్ అధికారి తమ తమ విభాగాలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా క్షేత్ర పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయితీరాజ్, ఆర్ అండ్ బి అధికారులు తమ శాఖల రోడ్లకు సంబంధించి ప్రభుత్వ మర్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని, సర్వేల్యాండ్ రికార్డ్స్ అధికారులు సర్వేనెంబర్లను సరిచూడాలని, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు లేఅవుట్లకు ఒక క్రమ పద్ధతిన విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు డిమాండ్ నోటీసు ప్రకారం రుసుం వసూలు చేసి జాప్యం జరుగకుండా విద్యుత్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ సూచించారు. నీటి వనరులకు ఇబ్బంది లేకుండా లేఅవుట్లు ఉండాలని, చెరువులు, కుంటలు ఉన్న లేఅవుట్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని నీటి పారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆన్ ఆధరైజ్డ్ లే అవుట్ల నియంత్రణలో రిజిస్ట్రేషన్ శాఖ పాత్ర కీలకమైనదని, లే అవుట్లు ఆథరైజేషన్ పొందిన పిదపనే రిజిస్ట్రేషన్ జరిగేలా రిజిస్ట్రేషన్ శాఖ తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే అనుమతుల కొరకు వచ్చినదరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేసి అనుబంధశాఖల అధికారులందరూ తమ నివేదికలతో లే అవుట్ల ఆమోదం కొరకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ కమిటీ సభ్యులను ఆదేశించారు.
నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎస్. మధుసూధన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, సర్వేల్యాండ్ ఏ.డి.రాము, ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజనీరు లక్ష్మణ్, పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు జి.వి. చంద్రమౌళి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ జిల్లా అధికారి సత్యనారాయణ, మధిర, సత్తుపల్లి, వైరా మున్సిపల్ కమీషనర్లు రమాదేవి, కె. సుజాత, వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయితీ అధికారి ప్రభాకర్ రావు, జిల్లా రిజిస్ట్రారు సి.హెచ్, అశోక్, విద్యుత్ శాఖ డి. రామారావు, నగర పాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ సురేష్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
————————————————————————————————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.