జనగామ, నవంబరు 30 : జిల్లాలో వాయిదా పడిన రెండు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ప్రక్రియ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మద్యం దుకాణాల లక్కీ డ్రా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 47 మద్యం దుకాణాలకు గానూ, 45 మద్యం దుకాణాల కేటాయింపుకు ఈ నెల 20 వ తేదిన లక్కీ డ్రా పూర్తికాగా, మిగిలిన జనగామ మునిసిపల్ పరిధిలో ఒకటి , పెంబర్తి లో ఒకటి ఉన్న ఈ రెండు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. రీ నోటిఫికేషన్ తరువాత మిగిలిన 6వ నెంబర్ మద్యం దుకాణానికి గాను 61, 11వ నెంబర్ మద్యం దుకాణానికి 56 దరఖాస్తులు వచ్చాయన్నారు. పెంబర్తి గ్రామంలోని 11 వ నెంబర్ మద్యం దుకాణానికిగాను నాతి సజ్జన్ కుమార్, జనగామ కురుమవాడలోని 6 వ నెంబర్ మద్యం దుకాణానికి పోకల లావణ్యలు లక్కీ డ్రా ద్వారా షాపులు పొందినట్లు ఆయన తెలిపారు. ఈ డిసెంబర్ 1 వ తేదీ నుండి మద్యం దుకాణాలు దక్కించుకున్న అభ్యర్థులకు గడువు మొదలై రెండు సంవత్సరాల పాటు ఉంటుందని తెలిపారు. ఈ లక్కీ డ్రా కార్యక్రమం దరఖాస్తుదారుల సమక్షంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్. మహిపాల్ రెడ్డి, ఏసిపి జి. కృష్ణ, ఎక్సైజ్ సిఐలు సిహెచ్. నాగేశ్వర్ రావు, బి. ముకుందరెడ్డి, ఎం. బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.