ప్రచురణార్ధం
జిల్లాలో విజయవంతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ
*జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న, సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపిన జిల్లా కలెక్టర్
164 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు పంపిణీ
*సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
*సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఉద్యోగుల పిల్లల కోసం *చైల్డ్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
—————————–
పెద్దపల్లి, జనవరి-26 :
——————————
జిల్లాలో విజయవంతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ తెలిపారు.
జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ లు వి.లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, డి.సి.పి. రూపేష్ లతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి జిల్లాలో జరుగుతున్న, జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్లుప్తంగా తన సందేశం ద్వారా తెలియజేశారు.
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సుమారు 4 లక్షల 50 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు లక్ష్యంగా నిర్ణయించుకొని జనవరి 19 నుండి 34 వైద్య బృందాల ద్వారా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, ప్రజలందరూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రామగుండం వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులను వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకున్నామని, నంది మేడారం గ్రామంలో 7-50 కోట్లతో నిర్మించే 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి చేతుల మీదుగా ఇటీవలే శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని, మాతా, శిశు మరణాల నిష్పత్తిని గణనీయంగా తగ్గించడానికి 2022 ఏప్రిల్ నుండి ఇప్పటివరకు 3505 మంది మహిళలకు కేసీఆర్ కిట్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఐదు పడకల డయాలసిస్ సెంటర్ మంజూరు కాబడి, ఎం. ఓ.యు పూర్తి చేసుకున్నామని, త్వరలో పెద్దపల్లిలో ప్రభుత్వ రంగంలో డయాలసిస్ సేవలు ప్రజలకు అందుబాటులో రానున్నాయని తెలిపారు.
ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే దిశగా మన ఊరు మన బడి పథకం క్రింద జిల్లాలో మొదటి దశలో 191 ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రతి మండలంలో రెండు పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా ఎంపిక చేసి వాటిలో అభివృద్ధి పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభించుటకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలోని 65 పాఠశాలలో 6 నుండి 10వ తరగతి చదివే 8600 మంది విద్యార్థులు సంచార ప్రయోగశాల కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారని, జిల్లాలో పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధన కోసం నిపుణులైన ఉపాధ్యాయులచే స్టడీ మెటీరియల్ తయారుచేసి అందించడం జరిగిందని తెలిపారు.
జిల్లాలో చేపట్టిన స్వచ్ఛ కార్యక్రమాల ఫలితంగా స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ 2023 లో భాగంగా ఓడిఎఫ్ ప్లస్ లో సాధించిన ప్రగతి ఆధారంగా నాలుగు స్టార్ కేటగిరిలో జాతీయ స్థాయిలో జిల్లా మూడో స్థానంలో నిలిచిందన్నారు.
జిల్లాలో 98 వేల 312 మందికి ఆసరా పింఛన్ల క్రింద ప్రతి మాసం 22 కోట్ల 90 లక్షలు చెల్లిస్తున్నామని, జిల్లాలోని గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించుటకు 353 పల్లె ప్రకృతి వనాలు, 64 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్లు, విద్యార్థుల, యువత శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడే విధంగా 226 తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రైతుబంధు పథకం క్రింద యాసంగి పంటకు జిల్లాలోని ఒక లక్షా 28 వేల 192 మంది రైతులకు పంట పెట్టుబడి సహాయం క్రింద 99 కోట్ల 48 లక్షలను వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగిందని, రైతు బీమా పథకం కింద 2022 సంవత్సరానికి గాను జిల్లాలో మరణించిన 151 రైతు కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఏడు కోట్ల యాబై ఐదు లక్షల రూపాయలు విలువ గల చెక్కులను పంపిణీ చేసామని,జిల్లాలోని 72 వేల 579 వ్యవసాయ కనెక్షన్లకు ప్రతి ఏటా 108 కోట్ల 66 లక్షల వ్యయంతో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించడం జరుగుతుందని తెలిపారు.
టీఎస్ ఐపాస్ ద్వారా జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 కోట్ల రూపాయల పెట్టు బడితో 299 మందికి ఉపాధి కల్పించేలా 41 యూనిట్లకు అనుమతులు జారీ చేశామని, టి ప్రైడ్, టీ ఐడియా క్రింద జిల్లాలో 966 ఎంఎస్ఎమ్ఈ లబ్ధిదారులకు 60 కోట్ల 75 లక్షలు సబ్సిడీ విడుదల చేసినట్లు తెలిపారు.
కళ్యాణ లక్ష్మి ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 22వేల 177 మంది లబ్ధిదారులకు 221 కోట్ల 26 లక్షలు, షాది ముబారక్ ద్వారా 1588 మంది లబ్ధిదారులకు 13 కోట్ల 92 లక్షల విలువగల చెక్కులను పంపిణీ చేశామన్నారు.
పర్యావరణ సమతుల్యత పాటించడానికి భూతాపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా 2022 సంవత్సరంలో జిల్లాలో 47 లక్షల మొక్కలు నాటినట్లు, జిల్లాలో ఉన్న 1076 నీటి వనరులను గుర్తించి కోటి 49 లక్షల చేప పిల్లలను రిజర్వాయర్లు బ్యారేజీలలో, 80 లక్షల రూపాయలు విలువ గల 37 లక్షల 65 వేల రొయ్య పిల్లలను 100% రాయితీతో ఉచితంగా పంపిణీ చేసి ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా 5వేల మందికి లబ్ధి చేకూర్చామన్నారు.
జిల్లాలో 18 వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు విస్తరించాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుని, సుల్తానాబాద్ మండలంలోని రెబ్బదేవపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ నర్సరీ ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన మొక్కలు సబ్సిడీపై సరఫరా చేస్తున్నామని, జిల్లాలో 4763 ఎకరాలలో ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు 1317 మంది రైతులను గుర్తించగా, ఇప్పటివరకు 955 ఎకరాలలో 297 మంది రైతులు ఆయిల్ పామ్ మొక్కలు నాటినట్లు తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ క్రింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ విద్యార్థులకు ఏడు కోట్ల ముప్పై ఏడు లక్షల 76 వేల 585, బీసీ విద్యార్థులకు 16 కోట్ల 50 లక్షల 14 వేలు, మైనార్టీ విద్యార్థులకు కోటి 28 లక్షల 39వేలు, 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎస్టీ విద్యార్థులకు కోటి 30లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా జిల్లాలోని 76 అంగన్వాడి కేంద్రాల ద్వారా 4071 మంది గర్భిణీలు, 4795 మంది బాలింతలకు ఏడు నెలల నుండి ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల 27 వేల 333 మంది పిల్లలకు పౌష్టికాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నామని, వృద్ధుల సంక్షేమం కొరకు సుల్తానాబాద్ పట్టణంలో వృద్ధాశ్రమం 2 బ్లాక్ లకు (70) లక్షల రూపాయలతో మంజూరు చేయించుకుని ఇటీవలే రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిచే శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలిపారు.
అలాగే వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులకు , ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
జిల్లా కలెక్టర్ సందేశం అనంతరం జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. పెద్దపల్లి మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థినులు దిల్ హే ఇండియా పాట పై చేసిన ప్రదర్శనకు మొదటి బహుమతి, పెద్దపల్లి ట్రినిటీ పాఠశాల విద్యార్థినిలు చేసిన నృత్య ప్రదర్శనకు రెండవ బహుమతి ఎంపికయ్యాయి. గెలుపోందిన విద్యార్థులకు కలెక్టర్, ముఖ్య అతిథులు మెడల్స్, మెమెంటోళ్లను అందించారు. చిన్నారి బి.హర్షిని చేసిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
అనంతరం జిల్లాలోని స్వాతంత్ర్య సమర యోధులైన తానిపర్తి కాంతారావు, ఎర్రబెల్లి రంగారావు లను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా చైతన్య సమాఖ్య జ్యొతి మహిళా సంఘానికి బ్యాంకు లింకేజ్ క్రింద 26 కోట్ల 49 లక్షల 50 వేల చెక్కును కలెక్టర్ అందించారు.
అనంతరం వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన 164 మంది ఉద్యోగులకు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు.
అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, డి.ఆర్.డి. ఏ., మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ, చేనేత, జౌళి శాఖ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ లను జిల్లా కలెక్టర్ సందర్శించారు.
అనంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పనిచేసే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పిల్లల కోసం ఏర్పాటు చేసిన చైల్డ్ కేర్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి వెంకట మాధవరావు, ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
—————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.