జిల్లాలో విద్యా వ్యవస్థను పూర్వ స్థితిలో కొనసాగించేందుకు విద్యా సంస్థలలో అవసరమైన ఏర్పాట్లను ఈ నెల 30 వ తేదీలోగా పూర్తి చేసి సంసిద్ధంగా ఉంచాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

ఆగష్టు, 25 ఖమ్మం:

జిల్లాలో విద్యా వ్యవస్థను పూర్వ స్థితిలో కొనసాగించేందుకు విద్యా సంస్థలలో అవసరమైన ఏర్పాట్లను. ఈ నెల 30 వ తేదీలోగా పూర్తి చేసి సంసిద్ధంగా ఉంచాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 1వ తేదీ నుండి విద్యా సంస్థల పున: ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలల పునః ప్రారంభ ఏర్పాట్లపై బుధవారం టి.టి.డి.సి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి విద్యా, వైద్య, సంక్షేమ శాఖల జిల్లాస్థాయి ఉన్నత అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ గత ఒకటిన్నర. సంవత్సరాలుగా కోవిడ్-19 మహామ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొని సాధారణ స్థితికి చేరుకున్నామని.. పాఠశాలలు నిరంతరాయంగా మూతపడటం వలన విద్యార్థులు మానసిక ఒత్తిడిలో ఉన్నారని, ప్రభుత్వ పాఠశాల విద్యపై ఆధారపడిన పేద విద్యార్థులందరిని తిరిగి పాఠశాలలకు వసతి గృహాలకు తేవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పాఠశాలల పున: ప్రారంభం నేపథ్యంలో జిల్లాలో గల 1627 పాఠశాలల్లో నమోదై ఉన్న 1,76,969 మంది విద్యార్థులందరూ తిరిగి తరగతులకు హాజరయ్యేలా సత్వర చర్యలు తీసుకోవాలని విద్యా శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో అన్ని పాఠశాలలలో పారిశుధ్య, పరిశుభ్రత పనులను ముమ్మరం చేసి ప్రతి తరగతి గదిని స్యానిటైజ్ చేయాలని, పాఠశాల ఆవరణలో నీటి నిల్వలు, పిచ్చి మొక్కలు లేకుండా పరిశుభ్రత పనులు పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా విద్యార్థులకు అవసరమైన కనీసవసతులైన త్రాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం అన్ని పాఠశాలలలో విద్యార్థులకు అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి గతంలో ఇండెంట్ చేసి ఆహార పదార్థాలు నిల్వలను వినియోగించరాదని, తాజా ఆహార పదార్థాలను మాత్రమే వినియోగించాలని, మధ్యాహ్న భోజనానికి వినియోగించే సామాగ్రి, ఏజెన్సీ బాధ్యలను సిద్ధంగా ఉంచాలని, పాఠశాలల్లో ఉపాధ్యాయులతో పాటు వంట మనుషులు కూడా తప్పనిసరిగా కోవిడ్ టీకా తీసుకొని ఉండేలా చూడాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలల్లో, విద్యార్థులచే పరిశుభ్రత, పారిశుధ్య పనులు ఎట్టి పరిస్థితులలో చేపట్టరాదని, ఇట్టి సంఘటనలు సంభవిస్తే బాధ్యులపై తీవ్ర చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. అన్ని పాఠశాలల్లో విద్యుత్, త్రాగునీటి సౌకర్యం ఉండేలా ఐదు రోజుల లోపు పనులను పూర్తి చేయాలని, మిషన్ భగీరథ నీటి సరఫరా పాఠశాలలకు జరగాలని ఇప్పటికే విద్యుత్ కనెక్షన్లు తొలగింపబడిన పాఠశాలలకు వెంటనే తిరిగి కనెక్షన్లు ఇవ్వాలని విద్యుత్ శాఖ ఎస్.ఇ ను మంత్రి ఆదేశించారు. గ్రామాలలో గ్రామ పంచాయితీల ద్వారా, మున్సిపల్ ప్రాంతాలలో మున్సిపాలిటీల ద్వారా పాఠశాలల పరిశుభ్రత పనులు చేపట్టాలన్నారు. దీనితోపాటు ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కె.జి.బి.వి లలో కూడా అన్ని వసతులను సమకూర్చుకోవాలని ప్రధానంగా బాలికల విద్యాలయాలు, వసతి గృహాలలో పటిష్ట రక్షణ, భద్రత చర్యలుండాలని మంత్రి సూచించారు. పాఠశాలలు పున: ప్రారంభమైన వారంలోగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందించాలని, వసతి గృహాల విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని మంత్రి. “అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో పాఠశాలలు పున: ప్రారంభ సంసిద్ధత ఏర్పాట్లపై ఇప్పటికే సంబంధిత అధికారులకు తగు ఆదేశాలివ్వడం జరిగిందని, రాబోయో ఐదు రోజులలో అన్ని పాఠశాలలను సంసిద్ధంగా ఉంచుతామని కలెక్టర్ తెలిపారు. పాఠశాలల పున: ప్రారంభం నేపథ్యంలో విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యా కమిటీ సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయిలో విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని, తరగతులకు హాజరయ్యే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలని, అన్ని పాఠశాలలలో పల్స్ ఆక్సీమీటర్లు, ధర్మామీటర్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ విద్యా, వైద్య శాఖాధికారులు ఆదేశించారు.

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు లింగాల కమలరాజు, నగరమేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా విద్యా శాఖాధికారి యాదయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతీ, జిల్లా పంచాయితీ అధికారి ప్రభాకర్రావు, జిల్లా బి.సి. మైనారిటీ సంక్షేమ శాఖాధికారి శ్రీమతి జ్యోతి, జిల్లా పరిశ్రమ శాఖాధికారి శ్రీమతి సంధ్యారాణి, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి కె.సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి కృష్ణనాయక్, కె.జి.బి.వి. విద్యాలయం, రెసిడెన్షియల్ విద్యాలయాల రీజినల్ కో- ఆర్డినేటర్లు, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపల్ కమీషనర్లు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post