జిల్లాలో వివిధ ప్రభుత్వ సంస్థల నిర్మాణాలకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను గుర్తింపు ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు 04 ఖమ్మం:

జిల్లాలో వివిధ ప్రభుత్వ సంస్థల నిర్మాణాలకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను గుర్తింపు ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ అంశాల పనుల పురోగతిపై కలెక్టర్ మండలాలవారీగా సమీక్షించారు. ధరణీ పెండింగ్ కేసులు పెండింగ్ మ్యూటేషన్లు, కోర్టు కేసులు, పెండింగ్ స్లాట్ బుకింగ్, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలకు ప్రభుత్వ స్థలాలు గుర్తించడం తదితర పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ తహశీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, గురుకులాలు, కళాశాలలు, వెజ్-నాన్వెజ్ మార్కెట్లు, క్రీడా ప్రాంగణాలు తదితర నిర్మాణాలకు సంబంధిత తహశీల్దార్లు తమ మండల పరిధిలో అవసరమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి సంబంధిత శాఖలకు అప్పగించాలని, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు సద్వినియోగమయ్యెలా త్వరితగతిన స్థలాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మ్యూటేషన్లు, కోర్టు కేసులు, గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్, పి.ఓ.బి పెండింగ్ కేసులపై కలెక్టర్ సమీక్షించారు. పెండింగ్ కేసులు అధికంగా ఉన్న మండల తహశీల్దార్లకు పలు ఆదేశాలు చేసారు. పెండింగ్ పనులన్నీ రెండు రోజులలోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పి.ఓ.బి పెండింగ్ కేసులపై తీసుకున్న పరిష్కార చర్యల రోజువారీ నివేదిక సమర్పించాలని వారంలోగా పి.ఓ.బి పెండింగ్ కేసులన్నీ పరిష్కరించాలని కలెక్టర్ తహశీల్దార్లను ఆదేశించారు. పెండింగ్ కోర్టు కేసులు స్లాట్ బుకింగ్, మార్టిగేజ్ దరఖాస్తుల పరిష్కార చర్యలపై జిల్లా రెవెన్యూ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ఆయా మండలాల పరిధిలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, పూర్తి నిబంధనలను పాటిస్తూ లాటరీ పద్ధతిని పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని కలెక్టర్ సూచించారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ, తహశీల్దార్లు, కలెక్టరేట్ కార్యాలయపు పరిపాలనాధికారి మదన్ గోపాల్, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post