జిల్లాలో వివిధ ప్రాజెక్టుల నిమిత్తం కొనసాగుతున్న భూసేకరణ పెండింగ్ పనులపై సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

అక్టోబరు,08,ఖమ్మం:

జిల్లాలో వివిధ ప్రాజెక్టుల నిమిత్తం కొనసాగుతున్న భూసేకరణ పెండింగ్ పనులపై సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో విజయవాడ-ఖాజీపేట్ 3 వ లైన్, భద్రాచలం రోడ్ సత్తుపల్లి రైల్వే లైన్, రైల్వే ప్రాజెక్టుకు గాను ఇప్పటివరకు జరిగిన భూసేకరణ, ఇంకనూ పెండింగ్లో ఉన్న పనులపై కలెక్టర్ సమీక్షించారు. అదేవిధంగా సింగరేణికు సంబంధించి రేజర్ల, జగన్నాథపురం అర్.అండ్.ఆర్, కొమ్మెపల్లి పెండింగ్ భూసేకరణ పనులను, ఇర్రిగేషన్కు సంబంధించి సీతారామ ఎత్తిపోతల పథకం, శ్రీరామ్ సాగర్, బుగ్గవాగు ప్రాజెక్టు భూసేకరణ పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు చేసారు. దీనితో పాటు రోడ్లు భవనాల శాఖకు సంబంధించి నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం ఆర్ అండ్ బి రోడ్డు, నగరంలోని మామిళ్ళగూడెం రైల్వే అండర్ బ్రిడ్జి భూసేకరణ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. మామిళ్ళగూడెం రైల్వే ఓవర్ బ్రిడ్జి భూసేకరణ పనులకు హైకోర్టు అనుమతి లభించినందున టెండరు ప్రక్రియను ప్రారంభించి పనులను త్వరగా చేపట్టాలని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల కింద ఇప్పటికే పూర్తయిన భూసేకరణకు సంబంధించి ఇంకనూ పెండింగ్లో ఉన్న పరిహారాన్ని వెంటనే బాధితులకు అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూసుమంచి, తిర్మలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలంలో ఇంకనూ పెండింగ్లో ఉన్న భూసేకరణపై సత్వర చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా రైల్వే, సింగరేణిలకు సంబంధించి అదనపు ప్రతిపాదనలను కూడా వారంలోగా సమర్పించాలని కలెక్టర్ సూచించారు. విజయవాడ-ఖాజీపేట రైల్వే లైన్కు సంబంధించి మధిర, బోనకల్, చింతకాని మండలాలలో భూసేకరణ పెండింగ్ సమస్యలపై సత్వర చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ డివిజనల్ అధికారులు, సంబంధిత రైల్వే అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

అదనపు కలెక్టర్ ఎన్ మదుసూథన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీరు అమిత్ అగర్వాల్, సింగరేణి జనరల్ మేనేజర్ నర్సింహారావు, జాతీయ రహదారుల పి.డి దుర్గా ప్రసాద్, సర్వేల్యాండ్ ఏ.డి రాము, ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్యాంప్రసాద్, మున్సిపల్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు కృష్ణలాల్, నీటిపారుదల శాఖ అధికారులు, సంబంధిత తహశీల్దార్లు, ఇంజనీరింగ్ విభాగపు డి.ఇలు, ఏ.ఇలు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post