జిల్లాలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని, 18 సం॥లు వయస్సు నిండిన అర్హత గల ప్రతి ఒక్కరు రెండు డోసుల టీకా తీసుకునే విధంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్‌ రైతు వేదికలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, వరుణ్‌రెడ్దిలతో కలిసి వ్యాక్సినేషన్‌, వరిధాన్యం కొనుగోలు, ఓటరు జాబితా, ధరణి, కళ్యాణలక్ష్మీ తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఆయా మండలాల తహశిల్దార్డు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్‌ కారక్రమం పూర్తి చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల వారిగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదటి డోసు తీసుకున్న వారు, రెండు డోసులు తీసుకున్న వారు, వ్యాక్సిన్‌ తీసుకోని వారి పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి అందించాలని తెలిపారు. అన్ని గ్రామాలలో వ్యాక్సినేషన్‌ పై ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాక్సిన్‌ తీసుకోని వారిని గుర్తించి వెంటనే టీకా తీసుకునేలా అవగాహన కల్పించాలని, గ్రామాలలో టాం-టాం వేయించాలని, వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రతి ఇంటికి స్టిక్కర్‌ అతికించాలని, ప్రతి రోజు 15 వేల వ్యాక్సినేషన్‌ డోసులు అందించే విధంగా అధికారులు కార్యచరణ రూపొందించి అమలు చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారు ధాన్యం కొనుగోలు చేయబోమని స్పష్టం చేసినందున రైతులు యాసంగిలో వరిధాన్యం మినహాయించి వాణిజ్య, ఆరుతడి, కూరగాయల, నూనె జలు, పప్పు దినుసులు తదితర ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, వరిధాన్యం మాత్రమే సాగు చేయాలనుకుంటే రైస్‌మిల్లులు, విత్తన సంస్థలతో ముందస్తు ఒప్పందం చేసుకున్న రైతులు మాత్రమే చేయాలని తెలిపారు. దళిత బంధు పథకంలో భాగంగా నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేయవలసి ఉంటుందని, అర్హులైన లబ్దిదారుడికి 10 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. నలుగురు / ఐదుగురు కలిసి ఒక పథకం ఎంపిక చేయాలని, అన్ని యూనిట్లు విజయవంతం అయ్యే విధంగా అధికారులు చొరవ చూపాలని తెలిపారు. జిల్లాలోని ఓటరు జాబితా తయారీలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలని, 18 సం॥లు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు వారి వివరాలు నమోదు చేసుకొని ఓటు హక్కు పొందేలా అధికారులు విసృత ప్రచారం నిర్వహించాలని, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులతో పాటు చిరునామా మారిన వారు, మృతి చెందిన వివరాల తొలగింపు, రెండు మూడు ఎపిక్‌ కార్జులు కలిగిన వారి వివరాల సవరణ కార్యక్రమాలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రత్నమాల, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి మనోహర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ రాజస్వ మండల అధికారులు దత్తు, చిత్రు, తహశిల్దార్లు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post