జిల్లాలో సజావుగా ధాన్యం కొనుగోళ్లు జరగాలి……. అదనపు కలెక్టర్ వీరారెడ్డి

జిల్లాలో సజావుగా ధాన్యం కొనుగోళ్లు జరగాలి

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు

రైతులందరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునేలా చైతన్యపరచాలి

జిల్లాలో 143 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు……. అదనపు కలెక్టర్ వీరారెడ్డి

వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు తగిన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పౌరసరఫరాల సంస్థ మరియు శాఖ ఆధ్వర్యంలో వానాకాలం వరి ధాన్యం కొనుగోలు పై అవగాహన సదస్సును నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతులు వానాకాలం పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు చేయడానికి వీలుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

జిల్లాలో ధాన్యం ఈనెలాఖరులో లేదా వచ్చేనెల మొదటి వారం నుండి వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైనన్ని తూకపు మిషన్లు, తేమ యంత్రాలు, గోనె సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో కనీస వసతులు ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు.కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న రైతులు మాత్రమే కేంద్రాలకు వచ్చేలా చూడాలన్నారు.

జిల్లాలో 143 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డి.సి.ఎం.ఎస్. ద్వారా 12 కేంద్రాలు, ఐ.కె.పి ద్వారా 80 కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 51 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు గ్రేడ్’ ఏ ‘ రకం రూ.1960/-, సాధారణ రకం ధాన్యానికి రూ.1940/- గా ఉందని తెలిపారు. వరి ధాన్యాన్ని FAQ ప్రమాణాలకు కబడి కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలకు ఆయన సూచించారు.

అవగాహన సదస్సులో ఇంచార్జి పౌరసరఫరాల అధికారి రాధికా రమణి, పౌర సరఫరాల సంస్థ డిఎం సుగుణ బాయ్, డి ఆర్ డి ఓ శ్రీనివాస రావు, వ్యవసాయ శాఖ జె.డి. నరసింహారావు, డి సి ఓ ప్రసాద్, మిల్లర్లు, వ్యవసాయ శాఖ అధికారులు కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post