జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు మరో నెలరోజులపాటు పూర్తి నివారణ చర్యలతో మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు, 14 ఖమ్మం:

జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు మరో నెలరోజులపాటు పూర్తి నివారణ చర్యలతో మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణ చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలులు చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2019 ఆగష్టు మాసంకంటే ఈ సంవత్సరం ఆగష్టు నెలలో డెంగ్యూ కేసులు అధికంగా నమోదయ్యాయని, జిల్లాలో వరుసగా భారీ వర్షాలు, వాతావరణ ప్రభావం మరో 3 వారాల పాటు ఉంటుందని, ఇదే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముందస్తు నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికి జిల్లాలో డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు ప్రతిరోజు నమోదవుతున్నాయని, అందుకు గల కారణాలను, లోపాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో ముమ్మర చర్యలను చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. బహిరంగ ప్రదేశాలలో అపరిశుభ్రమైన వాతావరణంలో తినుబండాల విక్రయం, హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రత నిబంధనలు పూర్తిగా పాటించేలా ఫుడ్ ఇన్స్పెక్టర్ తరచు తణిఖీలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. దీనితో పాటు రాబోయో నెలరోజుల పాటు “”డైడే” కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని, గ్రామాలలో పారిశుధ్య పనులు ముమ్మరంగా జరగాలని, వాటర్ క్లోరినేషన్, బ్లీచింగ్, స్ప్రేయింగ్, యాంటీ లార్వా కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగనిర్ధారణ పరీక్ష కిట్స్ సరిపడా అందుబాటులో ఉంచాలని సీజనల్ వ్యాధులకు సంబంధించిన రోగనిర్ధారణ పరీక్షల నివేదికలు ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి సంబంధిత వైద్యాధికారి ధృవీకరణతో పాటు పొందాలని జిల్లా వైద్యశాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. దీనితోపాటు ప్రయివేటు వైద్యశాలలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ప్రజల నుండి అధిక ఫీజులు వసూలు చేయకుండా, రోగ నిర్ధారణ తప్పుడు ఫలితాలు ఇచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ఇట్టి చర్యలకు పాల్పడే బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యశాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో త్రాగునీరు కలుషితం కాకుండా పరిశుభ్రమైన త్రాగునీటిని ప్రజలు వినియోగించేలా అన్ని నీటివనరులను తణిఖీ చేయాలని మిషన్ భగీరథ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగరపాలక సంస్థ కమీషనర్ స్నేహలత మొగిలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా||మాలతీ, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా॥బి. వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియా అధికారి డా॥ సంధ్య, ఆర్.ఎం.ఓ డా॥ శ్రీనివాసరావు, జిల్లా సర్వేలెన్స్ అధికారి డా॥రాజేష్, జిల్లా, ఇమ్యునైజేషన్ అధికారి డా॥ అలీవేలు, డా॥కోటి రత్నం, డా॥ నాగేశ్వరరావు, ప్రోగ్రాం అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post