జిల్లాలో అధికారుల పనితీరు అభినందనీయమని, అధికారులందరు సమన్వయంతో సమిష్టిగా కృషి చేసి జిల్లాను మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళాల్సిన బాధ్యత అధికారులపై ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు అనురాగ్ అన్నారు. గత సోమవారం నుండి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీతి అయోగ్ సభ్యుడు మాట్లాడుతూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలని, జోడేఘాట్ ప్రాంతంతో పాటు మార్లవాయి గ్రామం ఎంతో ప్రశప్తి పొందిందని, ప్రజల సౌకర్యార్థం ఆ ప్రాంతాలలో రహదారులు, అంతర్గత రహదారులు, సరైన నెట్వర్క్ బ్యాంకింగ్ సేవలు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారమైన చిరుధాన్యాలు అందించడం చాలా మంచి విషయమని, చిరుధాన్యాలు విక్రయించేందుకు తుంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కిరాణా దుకాణం బాగుందని, చిరుధాన్యాల ఆవశ్యకతపై ప్రజలకు మరించి అవగాహన కల్పించడంతో పాటు వినియోగించేలా ప్రోత్సహించాలని తెలిపారు. ధనోరా గ్రామంలో ఆపిల్ తోటపై ఉద్యానవన అధికారులు మరింత దృష్టి సారించి అభివృద్ధి చేయాలని, జిల్లాలో ఉన్న వనరులను సరిగ్గా ఉపయోగించుకుని అభివృద్ధి చెంది అందరికీ ఆదర్శంగా నిలువాలని అన్నారు. జిల్లాలో తాను గమనించిన పలు అంశాలు, అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై ఉన్నత స్థాయి అధికారులకు వివరిస్తానని, అధికారులు ఇదే స్ఫూర్తితో పని చేసి జిల్లాను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకువెళ్ళాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మనోహర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి రవికృష్ణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి సావిత్రి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.