వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మల్టీ లెవల్ విలేజ్ డిసిప్లీనరీ టీములు ఏర్పాటు చేయాలని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. మంగళవారం వాక్సినేషన్ ప్రక్రియపై హైదరాబాదు నుండి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులు, డిపిఓలు, జిల్లా పరిషత్ సిఈఓలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా తగ్గిపోయిందనే బ్రమలో ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని కానీ వ్యాధి ప్రమాదం పొంచి ఉన్నదని ప్రజలు గమనించాలని చెప్పారు. ఇతర దేశాల్లో న్యూ డెల్టా వేర్ వ్యాప్తి ఏ విధంగా జరుగుతున్నదో ప్రజలు గమనించి వ్యాధి నుండి సురక్షితంగా బయటపడాలంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు.
జిల్లాలోని 38 ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రత్యేక వ్యాక్సినేషన్ వాహనాలు ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు ఆయన వివరించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైద్యాధికారులు నిరంతర పర్యవేక్షణ చేయు విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వ్యాక్సిన్ కొరత లేదని ప్రజలు నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకునేందుకు వీలుగా గ్రామ, వార్డుస్థాయిల్లో పర్యవేక్షణకు ఏయన్యం, అంగన్వాడీ, గ్రామ కార్యదర్శులు, రేషన్ దుకాణ డీలర్లు, విఆర్పిలతో ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్బీ సిఈఓ విద్యాలత, డిపిఓ రమాకాంత్, వైద్యాధికారి డాక్టర్ శిరీష, ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగేంద్రప్రసాద్, డాక్టర్ చేతన్, డాక్టర్ సుజాత, డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.