జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో తప్పులు లేకుండా ఉండేందుకు వచ్చిన దరఖాస్తులను 7 రోజుల్లో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ప్రత్యేక ఓటరు సవరణలో బాగంగా వచ్చిన దరఖాస్తులలో పెండింగ్ ఉన్నవాటిని పరిశీలించాలని   రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటరు నమోదు, స్వీప్ కార్యక్రమాలపై  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి  మాట్లాడుతూ జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు  నమోదు చేసుకునే విధంగా స్వీప్ యాక్టివిటీ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఓటర్ల జాబితాను గరుడ యాప్ లో నమోదు చేయాలని తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేసి పెండింగ్ లేకుండా చూడాలని చెప్పారు. జనవరి 5వ తేదీన   తుది ఓటర్ జాబితాను ప్రచురించడం జరుగుతుందని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ గా తమ పేర్లు నమోదు చేసుకోవాలని, అర్హులైన వారందరి పేర్లను  ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా  నమోదు  చేసే ప్రక్రియను  నిరంతరంగా  కొనసాగించాలని సూచించారు.  భారత ఎన్నికల కమిషన్ రూపొందించిన  గరుడ యాప్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పనకు  విస్త్రుత స్వీప్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.  కళాశాలల్లో విద్యార్థులకు ఓటు హక్కు వినియోగం, ఈ వి ఎం, వి వి పాట్ వినియోగంపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.  కొత్తగా వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు బి.ఎల్.ఓ ల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి , ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు.   ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్వో అశోక్ చక్రవర్తి, ఆర్డీఓ స్వర్ణలత, ఎన్నికల సూపరింటెండెట్ రాజు, సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post