ప్రగతి పథంలో మెదక్ – జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

ప్రగతి పథంలో మెదక్  –  జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

మెదక్ జిల్లా హైదరాబాద్ కు సమీపంలో ఉండడమే గాక జిల్లా నుండి మూడు ప్రధాన జాతీయ రహదారులు వెళ్లుచుండడం, జిల్లా అంతటా అభివృద్ధి జరుగుచు ప్రగతి పధంలో ముందుకెళుతున్నదని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ తెలిపారు. దూరదర్శన్ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రధానంగా వ్యవసాయ ఆధార ప్రాంతమైన మెదక్ జిల్లాను అందరి సహకారంతో జిల్లాను వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. జిల్లాలో గత నాలుగైదు సంవత్సరాలుగా సాగు నీటి సౌకర్యం పెరగడం వల్ల 1.80 లక్షల నుండి 3. 23 లక్షల ఎకరాల వరకు సాగు పెరిగిందని వరి ధాన్యంతో పాటు పత్తి , శనగలు వంటి పంటలు పండిస్తున్నారని అన్నారు. పంట దిగుబడి కూడా గత యాసంగిలో 4. 42 లక్షల మెట్రిక్ టన్నులు రాగా ఈ ఖరీఫ్ లో సుమారు 5. 50 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేసి 311 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని అన్నారు.
పచ్చదనం-పరిశుభ్రతలో భాగంగా ప్రతి పల్లెలో సేగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రైతులు ఒక దగ్గర సమావేశమై చర్చించుకొనుటకు 76 క్లస్టర్ లలో రైతు వేదికలు నిర్మించామని అన్నారు. రహదారుల వెంట మొక్కలు నాటి పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలు బాగా పనిచేస్తున్నాయని పల్లి పట్టీలు, విస్తరాకులు, సంచులు, మాస్కులు నాణ్యతతో తయారీ చేస్తున్నారని, వాటిని ప్రత్యేక బ్రాండ్ తో మార్కెటింగ్ చేయుటకు కార్యాచరణతో ముందుకెళ్తున్నామని తెలిపారు. సంఘాలు కూడా రుణాలను సద్ద్వినియోగం చేసుకుంటూ 99 శాతం పైగా తిరిగి బ్యాంకులకు రుణాలు చెల్లిస్తున్నారని అన్నారు. ప్రజలు కూడా ముందుకొచ్చి వీటిని కొనుగోలు చేసి ఆర్థికంగా వీరికి చేయూత నివ్వవలసినదిగా కోరారు. పర్యాటకులు వారంతా సెలవులో ఆహ్లాద వాతావరణంలో గడుపుటకు జిల్లాలో పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయని, అదనపు కలెక్టర్, పర్యాటక అధికారి ప్రత్యేక శ్రద్ధతో పర్యాటకులను ఆకర్షించేందుకు నరసాపూర్ అర్బన్ పార్క్, పోచారం అభయారణ్యం, మెదక్ చర్చి, ఖిల్లా, ఏడుపాయలను కలుపుతూ ఒక సర్క్యూట్ గా ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. తద్వారా పర్యాటకుల సంఖ్య పెరిగి కొందరికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నాయని కలెక్టర్ తెలిపారు.

Share This Post