జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం అందుతుందని ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలి -తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ వై. రేణుక

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం అందుతుందని ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ వై. రేణుక అన్నారు.

సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కోర్టు హాలు నుండి అధికారులు, ప్రజా ప్రతినిధులతో జిల్లా న్యాయమూర్తులు, టీమ్ మెంబర్లతో గ్రామాలలో ఉచిత న్యాయ సహాయం పై అవగాహన కార్యక్రమాల అమలు పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి, న్యాయ సేవా చట్టం అమలుల్లోకి వచ్చి 25 సంవత్సరములు పూర్తి అయినందున ఆజాదీక అమృత్ మహొత్సవాలలో భాగంగా అక్టోబర్ 02 నుండి నవంబర్ 14 వరకు అన్ని గ్రామాలలో ఉచిత న్యాయం చట్టాల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ఉచిత వైద్యం ఎలా అందుతుందో అలాగే జిల్లాలలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో పేద ప్రజలకు ఎలాంటి ఫీజులు లేకుండా ఉచిత న్యాయ సహాయం అందుతుందని, ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నామని తెలిపారు. మహిళలకు, పిల్లలకు, కార్మికులకు, వార్షిక ఆదాయం 3 లక్షల కంటే తక్కువ ఉన్న వారందరికీ ఉచిత న్యాయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందుతుందని అవగాహన కల్పించాలని తెలిపారు. భారత రాజ్యాంగానికి అధికరణ 39-ఎ జతచేసి బీద, బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం రాష్ట ప్రభుత్వాల బాధ్యతగా నిర్దేశించిoదనీ, సమాజంలో 30 శాతం మంది మాత్రమే ఉచిత న్యాయ సేవను వినియోగించుకుంటున్నారని, మిగిలిన 75 శాతం మంది తమ ఆస్తులను అమ్ముకొని న్యాయ సహయం పొందుతున్నారని తెలిపారు. అందుకే ప్రజలందరికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహయం అందుతుందని తెలుపుచూ ప్రజల్లో అవగాహన పెంపొందించుటకు మీరంతా కలిసి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ఏవిధంగా అయితే ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నారో ఉచిత న్యాయం గురించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు. నవంబర్ 8 నుండి 14వరకు న్యాయ సేవల వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో మూడు రోజుల అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామాలలో ప్రజల్లో అవగాహన పెంపొందించుటకు జ్యూడిషియల్ ఆఫీసర్, ప్యానల్ లాయర్, పారా లీగల్ వాలంటీర్లు, న్యాయ విద్యార్థులు, ఎన్.జి.వో. లు, సోషల్ అక్టివిస్టులతో టీములను ఏర్పాటు చేసి గ్రామాలలో ప్రజలకు ఉచిత న్యాయం, న్యాయ చట్టాల పై అవగాహన నిర్వహించేందుకు వచ్చే వారికి మీ సహాకారం అందించాలని గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. బాధితులకు పరిహారం అందించడం జరుగుతుంది, పరిహారం అందే అవకాశం ఉన్న తీసుకోని వారికి పోలీసులు ఇప్పించాలని సూచించారు.

అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్సులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శ్రీదేవి, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, ట్రైనీ కలెక్టర్ కదిరవన్ ఫలనీ, జిల్లా పరిషత్ సీఈఓ దిలిప్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి మోతి, జిల్లా మైనారిటీ అధికారి రత్నకళ్యాణి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post