జిల్లా పరిషత్ సమావేశంలో ముఖ్య శాఖలపై చర్చ

గురువారం నాడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం సందర్భంగా ముఖ్యమైన పలు శాఖలపై సభ్యులు చర్చించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయం, విద్యుత్తు, అటవి, డి ఆర్ డి ఎ, వైద్య ఆరోగ్య శాఖ, సివిల్ సప్లైస్, ఆర్టీసీ, నీటిపారుదల శాఖ తదితర విషయాలపై సభ్యులు చర్చించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు రైతులు పంటల మార్పిడి వైపు వెళుతున్నట్లు తెలుస్తుందని ఇది ఎంతైనా సంతోషకరమన్నారు. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని రాష్ట్రంలో మొదటి సారిగా మన జిల్లా పరిషత్ లో తీర్మానం చేయడం జరిగిందని, చట్టాలు గొప్ప విషయం అని తెలిపారు. మూడు వేలకు పైగా కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు డి డి లు కట్టిన వారికి వీలైనంత త్వరగా కనెక్షన్ ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. జిల్లా అధికారులు మండలాలలో పర్యటిస్తే సంబంధిత ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా రెండు విడతల వ్యాక్సినేషన్ తీసుకోవాలని, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం ద్వారా దాని నుండి కాపాడుకోవడానికి రక్షణ కవచంగా పనిచేస్తాయని, జిల్లా యంత్రాంగం పరంగా దీనిని ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. టీ హబ్ ద్వారా జిల్లా ఆస్పత్రిలో అందిస్తున్న 57 రకాల ఉచిత పరీక్షల ప్రజలకు తెలిసేవిధంగా అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉన్నదని పేర్కొన్నారు.

సమావేశంలో ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని భూములను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నదని తద్వారా చాలా వరకు భూముల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.

అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ధరణిలో 90 శాతం పైగా భూములకు క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందని మరికొద్ది సమస్యలకు త్వరలోనే సర్వే చేసి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. పోడు భూములకు సంబంధించి 195 ఆవాసాలకు గాను 33,456 ఎకరాలకు దరఖాస్తులు వచ్చాయని, అన్నింటిని ఆన్లైన్ చేశామని, ప్రభుత్వం జారీ చేసే గైడ్ లైన్స్ కు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు అయిన తాండాలో తేదీలు నిర్ణయించి ప్రజలకు ఆరోజున రేషన్ బియ్యం సరఫరాకు చర్యలు తీసుకున్నామని అన్నారు.

త్వరలోనే రైతులకు రైతుబంధు చెల్లించుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు తెలుపగా, అవసరానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా ఉన్నందున ఎలాంటి కోతలు ఉండవని విద్యుత్ శాఖ ఎస్ఇ రవీందర్ తెలిపారు.
రైతు బీమాను కూడా 61 సంవత్సరాల వయస్సుకు పెంచాలని, ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ధాన్యం తరుగుకు డబ్బులు ఇప్పించాలని, ఆసుపత్రులలో సిబ్బంది సమస్య లేకుండా చూడాలని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు.

సమావేశం ప్రారంభానికి ముందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాల నరేంద్ర ఆకస్మిక మృతికి సంతాపసూచకంగా సభ రెండు నిమిషాలు మౌనంగా శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ గోవిందు, వైస్ చైర్పర్సన్ రజిత యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, జిల్లా అధికారులు చందర్ నాయక్, సుదర్శనం, ప్రతిమారాజ్, వెంకటేశ్వరరావు, జెడ్ పి టి సి లు, ఎంపీపీలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post