జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఉన్నతాధికారులు అధికారులు విధిగా హాజరు కావాలి-జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శాంతి కుమారి

పత్రిక ప్రకటన
తేది: 24-3-2023
నాగర్ కర్నూల్ జిల్లా
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఉన్నతాధికారులు అధికారులు విధిగా హాజరు కావాలి
అధికారులు పూర్తి సమాచారం తో వచ్చి ప్రజాప్రతినిధులు అడిగే ప్రశ్నలను నివృత్తి చేయాలి
ప్రతి మండల సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల తరపున తమ మండల, డివిజన్ స్థాయి అధికారులు హాజరయ్యే విధంగా చూడాలి – జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శాంతి కుమారి
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి తమ కిందిస్థాయి అధికారులను కాకుండా జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్ బి. శాంతకుమారి ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక ఎస్.జే. ఆర్ ఫంక్షన్ హాల్లొ నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్షత వహించగా ప్రభుత్వ విప్, అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజ్, నాగర్ కర్నూల్ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పి చైర్మన్ మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశానికి సంబంధిత శాఖల నుండి డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు హాజరు కావడం లేదని దానివల్ల మండలంలో పరిష్కారం కావాల్సిన సమస్యలు జిల్లా స్థాయికి వస్తున్నాయన్నారు. అందువల్ల మండల సర్వసభ్య సమావేశాలకు అన్ని శాఖల తరపున అధికారులు హాజరు అయ్యేవిధంగా చూడాలని సూచించారు.
ఈ సర్వసభ్య సమావేశంలో అతి ముఖ్యమైన ప్రజాసంబంధ శాఖల పై ముందుగా చర్చ చేపట్టారు. వ్యవసాయం, మిషన్ భగీరథ, భూగర్భ జలాలు, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ, విద్యుత్, మెడికల్ ఆసుపత్రి, విద్య, సాంఘిక సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖలపై వాడివేడిగా చర్చించారు.
ప్రభుత్వ విప్ అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మిషన్ భగీరథ ద్వారా ఇంకా ఎక్కడైన నల్లా కనెక్షన్లు, లైన్లు ఇవ్వని ప్రాంతాల్లో వెంటనే పనులు పూర్తి చేసి ప్రజలకు తాగు నీటి సమస్య లేకుండా చూడాలని సూచించారు. అచ్ఛంపేట నియోజకవర్గంలో కొన్ని చోట్ల సరిపడా నీరు రావడం లేదని అదేవిధంగా సాంకేతిక కారణాలవల్ల అచ్చంపేటకు రావాల్సినంత నీరు రావడం లేదన్నారు. స్పందించిన మిషన్ భగీరథ ఎస్.ఈ. వెంకటరమణ వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అన్నారు.
విద్యుత్ శాఖ సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ సబ్ స్టేషన్ల ఏర్పాటు చాలా ఆలస్యం జరుగుతున్నదని, ఓవర్ లోడ్ సమస్య లెవనెత్తుతూ విద్యుత్ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో ఫోన్ ఇన్ స్పీకర్ పెట్టి మాట్లాడారు. ఏ సమస్య ఉన్న త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అటవీశాఖ పై సమీక్ష సందర్భంగా అచ్ఛంపేట లో సమీకృత మార్కెట్ నిర్మాణానికి అటవీ శాఖకు సంబంధించిన పాత భవనాన్ని తొలగించాల్సి ఉందని అందుకు ప్రతిఫలంగా మరోచోట స్థలం కేటాయింపు కానీ లేదా పరిహారం చెలించడం జరుగుతుందన్నారు. ఉమామహేశ్వరం వద్ద చెక్ పోస్ట్ పెట్టడం వల్ల భక్తులకు ఇబ్బందులు కలుగుతుందని అక్కడ చెక్ పోస్ట్ అవసరం లేదన్నారు. చెంచులు ప్రతి సంవత్సరం సలేశ్వరం జాతర 15 రోజులు ఘనంగా జరుపుకుంటారని దానిని ఈసారి రెండు రోజులకు కుదించడం సరికాదన్నారు. చెంచులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారిని సూచించారు. చెక్ పోస్ట్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత నిధులు సంబంధిత గ్రామాభివృద్ధికి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు అయినప్పటికిని వైద్యసేవలో పెద్దగా మార్పు రాలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంజూరు అయిన వైద్య పోస్టులను సకాలంలో భర్తీ చేసే ప్రక్రియ నిర్లక్ష్యం చేస్తున్నారని వైద్య అధికారులను నిలదీశారు. సకాలంలో పోస్టులు భర్తీ చేయక ఉన్న డాక్టర్లు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్నారు. అలస్యంగా రావడం త్వరగా వెళ్లిపోవడం పరిపాటిగా మారిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోజువారీ అవుట్ పేషంట్ ల సంఖ్య పెరగాలని అందుకు ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల పై నమ్మకం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సబ్ సెంటర్ల మరమ్మతుకు సంబంధించి త్వరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని పంచాయతిరాజ్ కార్యనిర్వాహక ఇంజనీరును సూచించారు. ఆర్ అండ్ బి, పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ అధికారుల పనితీరు పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన ప్రజాప్రతినిధుల దృష్టికి తీసికురావాలని తెలియజేసారు.
ఈ సమావేశంలో పాల్గొన్న జడ్పి వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ మాట్లాడుతూ ఈ మధ్య కార్డియక్ అరెస్ట్ తో చనిపోతున్న సంఘటనలు అధికమయ్యాయని అందువల్ల ఆశావర్కర్లు, ఇతర సిబ్బందికి సి.పి.ఆర్ శిక్షణ కార్యక్రమం గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లాలని డి.యం హెచ్ ఓ ను కోరారు.
చారగొండ మండలంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికి ఇంకా తుది దశకు చేరుకోలేదని ప్రశ్నించారు. మెక్రల లో సైతం ఇంకా పూర్తి కాలేదని ఎప్పటికి పూర్తి చేస్తారని ప్రశ్నించారు. విద్యుత్ సమస్య పై పెద్దకొత్తపల్లి, పదర జడ్పి టిసి లు సైతం సమస్యను లేవనెత్తారు.
పదర జడ్పిటిసి రాంబాబు పదర మండలంలో తాగునీరు, విద్యుత్ సమస్యలతో పాటు పోడు భూముల పై ప్రశ్నించారు. సర్వే నెంబర్ 227, 221 లో ఉన్న 546 ఎకరాల భూమి పై మాట్లాడుతూ రెవెన్యూ భూమిని అటవీ శాఖకు అప్పగించినప్పటికిని సాగులో ఉన్న భూమి వదిలి మిగిలిన భూమికి హద్దులు చేసుకోవాలని కోరారు. పదర మండలం రాయలగండి లో కొంత మంది బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లగా అక్కడ పొడుభూముల సర్వే చేయలేదని ఇప్పుడు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. స్పందించిన జిల్లా కలెక్టర్ త్వరలోనే సర్వే చేస్తారని తెలియజేసారు. తెలకపల్లి లో అడవి పంది చనిపోయిందని 25 వేల రూపాయలు జరిమానా వేసి వసూలు చేసారని, మరోచోట అడవి పంది వల్ల మరణించిన బాలుడికి అటవి శాఖ తరపున పరిహారం ఎందుకు చెల్లించడం లేదని అడిగారు. అటవీ శాఖ అధికారులు అడవి పందికి ఇచ్చిన ప్రాముఖ్యత మనుషులకు లేదా అని ప్రశ్నించారు. స్పందించిన డి.ఎఫ్.ఓ సమస్య తన దృష్టికి రాలేదని తెలుసుకొని పరిష్కరిస్తానని తెలియజేసారు.
తెలకపల్లి ఎంపీపీ మధు, పెద్దకొత్తపల్లి జడ్పిటిసి గౌరమ్మ, వెలదండ జడ్పిటిసి, బలమూర్ జడ్పిటిసి సభ్యులు తమ మండల పరిధిలోని తాగు నీరు, విద్యుత్ సమస్యలను సభా దృష్టికి తీసుకువచ్చారు.
జిల్లాలో మామిడి పళ్ళ కొనుగోలు గత సంవత్సరం మాదిరి ఐ.కె.పి ద్వారా కొనుగోలు చేసేవిధంగా చూడాలని కోఆప్షన్ సభ్యుడు హమీద్ సభ దృష్టికి తెచ్చారు. స్పందించిన పి.డి డి ఆర్.డి.ఓ గత సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం సైతం ఐ.కె.పి ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో ఆదనవు కలెక్టర్ మను చౌదరి, జడ్పి డిప్యూటీ సి.ఈ.ఓ భాగ్యలక్ష్మి, జడ్పిటిసిలు, ఎంపిపి లు, కోఆప్ట్షన్ సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
———-
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.

Share This Post