జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్* *రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై ఆరా

జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్* *రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై ఆరా

*ప్రచురణార్థం-1*
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 24: సిరిసిల్ల పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో కలియ తిరిగి రోగులకు వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. డయాలసిస్ వార్డు, జనరల్ ఐసీయూ, కోవిడ్ ఐసీయూ, మెటర్నిటీ వార్డు, ఫార్మసీ, హెల్ప్ డెస్క్, సీటీ స్కాన్, ఆపరేషన్ థియేటర్, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న లిఫ్ట్, ఫైర్ సిలిండర్లు, పోస్టుమార్టం గది, ఔట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, తదితర వాటిని ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బాలింతలతో స్వయంగా మాట్లాడి వైద్యసేవల తీరుపై వారి స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో 30 పడకలతో కూడిన పిడియాట్రిక్ ఐసీయూ వార్డును నూతనంగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా పంచాయితీ రాజ్ ఇంజనీర్ ను కలెక్టర్ ఆదేశించారు. ఫార్మసీలో అందుబాటులో ఉన్న మెడిసిన్ వివరాలను అందరికీ కనిపించేలా డిజిటల్ పట్టిక ఏర్పాటు చేయాలని ఆసుపత్రి పర్యవేక్షకులను ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న గార్డెన్ ను మున్సిపల్ సిబ్బంది సహకారంతో మరింత అందంగా తీర్చిదిద్దాలని, తద్వారా ఈ గార్డెన్ లో ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు సేద తీరే విధంగా అనుకూలంగా ఉంటుందని అన్నారు. సోలార్ ప్లాంట్లను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాత్రివేళల్లో కూడా పోస్టుమార్టం చేయాలని ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో పోస్టుమార్టం గదిలో అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చూసుకోవాలని ఆదేశించారు. ఆపరేషన్ థియేటర్ లో కొత్త విద్యుత్ లైట్లను అమర్చాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అన్నారు. వైద్యులు, సిబ్బంది చిత్తశుద్ధితో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఆసుపత్రి పర్యవేక్షకులు డా. మురళీధర్ రావు, పంచాయితీ రాజ్ ఈఈ శ్రీనివాస రావు, వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Share This Post