జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి లతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి, మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, సెప్టెంబర్ 7:–
జన్మనిచ్చేది తల్లి ఐతే, జీవితానికి దారి చూపేది గురువు అని రాష్ట్ర శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ వి. భూపాల్ రెడ్డి పేర్కొన్నారు.

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి లతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి, మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గురువు బోధించే చదువుతోనే ప్రయోజకులు అవుతారని, తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటారని అన్నారు.పిల్లలు జీవితంలో సరైన దారిలో వెళ్లడానికి తల్లిదండ్రుల తర్వాత గురువులదే ప్రధాన పాత్ర అని ఆయన అభిప్రాయపడ్డారు. మరిచిపోలేనిది విద్య ఒక్కటేనని, విద్యనందించే గురువు గొప్పతనం గురించి ఆయన కొనియాడారు. తాను ఉన్నత స్థితికి రావడానికి తనకు చదువు చెప్పిన గురువు లేనని, చదువు మీద ఉండే ఆసక్తిని, గురువుల మీద ఉండే భక్తిని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఉపాధ్యాయులు మంచి భావిపౌరులను తయారు చేసి రాష్ట్రానికి, దేశానికి అందించాలని కోరారు.
జిల్లాలో ఉన్న పాఠశాలలన్నింటిని మరింత అభివృద్ధి దిశకు తీసుకెల్లేలా ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలని ఆయన కోరారు.

ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గౌరవం అమోఘమైనదన్నారు. తనకు చదువు చెప్పిన గురువులు అందరికీ పేరుపేరునా పాదాభివందనాలు చేస్తున్నానన్నారు. మంచి ఆలోచన విధానాన్ని రూపొందించుకునే లా విద్యార్థులను సరైన మార్గంలో నడిపించేది ఉపాధ్యాయులే నన్నారు. సమాజానికి మంచి పౌరులను అందించాలని కోరారు. వృత్తి గౌరవాన్ని, విలువలను పెంచే విధంగా ఉపాధ్యాయులు అందరూ పనిచేయాలని ఆయన కోరారు.

జెడ్పి చైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తల్లి లేని పిల్ల వాడు ఉంటాడు కానీ, గురువు లేని విద్యార్థి ఉండడని అన్నారు. గురువు కున్న స్థానం ఎంతో గొప్పదని, జాతి గర్వించే ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దేది ఉపాధ్యాయులన్నారు. సమాజాభివృద్ధికి తొలిమెట్టు పాఠశాల నుండి ప్రారంభం అవుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఎదగడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని, ఏమి ఇచ్చినా ఉపాధ్యాయుల రుణం తీర్చుకోలేనిదని ఆమె పేర్కొన్నారు.

అదనపు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖమైనదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, ఉపాధ్యాయుల కృషి వల్లే ఏ వ్యక్తి అయినా తాననుకున్న ఉన్నత స్థితికి చేరుతారని అన్నారు. పిల్లల విషయంలో ఉపాధ్యాయులు ఒక ఫిలాసఫర్ గా, గైడ్ గా, స్నేహితులుగా , మార్గదర్శకులుగా నిలిచి ఎక్కువ బాధ్యతలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవాలని, పిల్లల అభిరుచికి తగ్గట్టుగా వారిని ప్రోత్సహించాలన్నారు.

అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలో నిలిచాడంటే దాని వెనక ఉపాధ్యాయుల పాత్ర ప్రధానమైనదన్నారు. ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా గురువు బోధించిన విద్య వల్లే ఉన్నత స్థితికి వెళ్లారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. వృత్తి సంతృప్తినిచ్చే ఉద్యోగం ఉపాధ్యాయ వృత్తి అని ఆయన పేర్కొన్నారు. తాను ఆరు సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పని చేశానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ పురస్కారం ఉపాధ్యాయ లోకానికి అంతటికి చేసే సత్కారంగా భావించాల న్నారు. విద్యను మించిన ధనం లేదని విద్యతోనే అన్ని సమకూరుతాయన్నారు. ఒకటిన్నర సంవత్సరాల నుండి పాఠశాలలు పని చేయడం లేదని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించి బోధించాలని కోరారు.

అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ( 66 )మంది ఉపాధ్యాయులకు శాసనమండలి ప్రొటెం చైర్మన్, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు, జెడ్పి చైర్ పర్సన్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.

అంతకుముందు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో డిఈ ఓ రాజేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి ఐ ఓ గోవిందరావు, డిసిఎంఎస్ చైర్మన్ శివ కుమార్, జిల్లా సైన్స్ అధికారి విజయ్ కుమార్,ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎం ఈ ఓ లు, పురస్కార గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post