డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా అర్హులైన యువతీ యువకులు తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఓటు వజ్రాయుధమని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు.
మంగళవారం స్వీప్ కార్యక్రమంలో భాగంగా కాప్రాలోని అనీష్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఓటు హక్కు అనేది వజ్రాయుధమని దీనివల్ల ప్రజాస్వామ్యంబద్దంగా ఓట్లు వేసి నాయకులను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ప్రతి యువతీ, యువకులు తప్పకుండా ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదుకు సంబంధించి బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్ళి గతంలో ఓటర్లుగా లేని వారి పేర్లను నమోదు చేసుకొంటున్నారని వారికి సహకరించి ఓటు హక్కు లేని వారు వారి పేర్లను నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. దీంతో పాటు జిల్లాలోని ఆయా పోలింగ్ బూత్‌లలో డిసెంబరు 3, 4 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని దీనిలో ఓటరుగా నమోదు చేసుకొనేందుకు బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉండి కొత్తగా ఓటర్ల నమోదు ప్రక్రియతో పాటు సవరణలో, మార్పులు, చేర్పులు, తొలగింపులు చేస్తారని తెలిపారు. ఈ మేరకు ఈనెల డిసెంబరు 8వ తేదీలోగా నూతనంగా నమోదు చేసుకొనే ఓటు నమోదు ప్రక్రియను పూర్తి చేసే విధంగా చూడాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు, ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు. అలాగే ఓటరు ఫారం – 6, 6బీ, గరుడ యాప్ ల గురించి కళాశాల విద్యార్థులకు వివరించారు..ఈ కార్యక్రమంలో డిసిఓ శ్రీనివాస్ మూర్తి. జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డీసీ శంకర్, కాప్రా తహశీల్దార్ అనిత, బూత్ లెవల్ ఆఫీసర్లు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు