జిల్లా వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు అవసరమైన చర్యలు
అన్యాక్రాంతం, కబ్జాకు గురైన చెరువులను పరిశీలించి నోటీసులు జారీ చేయాలి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు. బుధవారం జిల్లాలోని చెరువుల పరిరక్షణపై అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యా నాయక్, ఇరిగేషన్, హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎన్ని చెరువులు ఉన్నాయి ? వాటిలో ఎన్ని కబ్జాకు గురయ్యాయనే వివరాలను ఇరిగేషన్. రెవెన్యూ శాఖల అధికారులు కలిసి సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి తమకు నివేదిక అందజేయాలని సూచించారు. అలాగే జిల్లాలో అన్యాక్రాంతమైన, కబ్జాకు గురైన చెరువులను పరిశీలించి వాటిని కబ్జా చేసిన వారికి నోటీసులు జారీ చేయాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అయినప్పటికీ కొన్ని చోట్ల చెరువుల కబ్జాలు, అన్యాక్రాంతమైనట్లు తమ దృష్టికి వచ్చిందని వాటి వివరాలను తెలుసుకొని క్షేత్రస్థాయిలో పర్యటించి సరైన నివేదిక అందజేయాలని కలెక్టర్ అధికారులకు వివరించారు. దీంతో పాటు గతంలో ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఈ విషయంలో ఏమాత్రం వెనుకాడరాదని అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ హరీష్ పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్ డి ఓ ,రవి,మల్లయ్య, తహశీల్దార్ లు ఇరిగేషన్, ఇంజనీరింగ్, హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.