జిల్లా వ్యాప్తంగా ధరణి సమర్ధవంతంగా అమలవుతోంది ధరణితో భూపరిపాలన రంగంలో మంచి మార్పులకు శ్రీకారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్

జిల్లా వ్యాప్తంగా ధరణి సమర్ధవంతంగా అమలవుతోంది
ధరణితో భూపరిపాలన రంగంలో మంచి మార్పులకు శ్రీకారం
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ధరణికి దేశంలోనే మంచి గుర్తింపు రావడంతో పాటు రైతులకు సేవలందించడం, భూపరిపాలన రంగంలో అనేక మంచి మార్పులకు శ్రీకారం చుట్టినట్లయిందని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ధరణి కార్యక్రమం రాష్ట్రానికే కాకుండా దేశం మొత్తానికి దిక్సూచిగా మారిందని ఈ విధానాన్ని రూపొందించి ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌ను రైతులు తమ సమస్యలు పరిష్కరించినందుకు ఎంతగానో కొనియాడుతున్నారని అన్నారు. ఈ ధరణి పోర్టల్ రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైనది కావడంతో పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా మంచి సంస్కరణలు రావడంతో పాటు భూములు రిజిస్ట్రేషన్ సమయంలో రైతులకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా తయారు చేసి వారికి సేవలందించేలా వినూత్నమైన, ఆధునిక ఆన్లైన్ పోర్టల్‌గా ఉందని కలెక్టర్ హరీష్ వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ధరణి ద్వారా సమస్యలు పరిష్కరించడంతో పాటు మండల తహశీల్దార్ కార్యాలయానికి తమ భూములు రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు వెళ్ళిన సమయంలో స్లాట్ ముందుగా బుక్ చేసుకున్న రైతులకు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించడం ఎంతో శుభపరిణామమని కలెక్టర్ అన్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ధరణి కార్యక్రమాన్ని అన్ని విధాలుగా సమర్ధవంతంగా అమలు చేస్తుండటంతో పాటు అందులో తమవంతు పాత్రపోషిస్తూ పాలుపంచుకొంటున్న జిల్లాలోని సంబంధిత అధికారులు, తహశీల్దార్లు, మండలాల అధికారులను ఈ సందర్భంగా కలెక్టర్ హరీష్ అభినందించారు. ధరణి పోర్టల్‌కు సంబంధించిన విషయంలో పూర్తి సహాయ, సహకారాలు, ఎంతో ఉన్నతమైన మార్గదర్శకాలు అందచేస్తూ ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్ర స్థాయి అధికారులకు ఈ మేరకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ధరణి పోర్టల్‌ను ప్రారంభించడంతో రిజిస్ట్రేషన్ సేవలు రైతులు, అన్నదాతల ఇళ్ళ వద్దకే చేరాయని దీనికి ముందు సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మాత్రమే భూసంబంధిత రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిర్వహించేవారని అప్పుడు ఎవరైనా రైతు తమ వ్యవసాయ పొలాన్ని అమ్మాలన్నా, కొనుగోలు చేయాలన్నా అందుబాటులో ఉన్న సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండటంతో పాటు అక్కడ ఎప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతుందన్న విషయం తెలిసేది కాదని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి రైతులకు అందుబాటులో ఉన్న తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొత్తగా ధరణి పోర్టల్‌ను రూపొందించి స్లాట్ బుక్ చేసుకొన్న వారికి అనుకున్న సమయానికి భూములు రిజిస్ట్రేషన్ చేయించి ఎలాంటి నయాపైసా ఖర్చు లేకుండా రైతులకు అందుబాటులో ఉండేలా దీనిని రూపొందించారని దీనిపట్ల రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని కలెక్టర్ హరీష్ వివరించారు. ధరణి పోర్టల్ రూపొందించడంతో భూపరిపాలనలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని, వ్యవసాయ సంబంధిత భూరిజిస్ట్రేషన్లు ప్రస్తుతం నిమిషాల్లో పూర్తవుతున్నాయని రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితితో పాటు మధ్యవర్తుల ప్రసక్తిలేకుండా ప్రణాళికబద్దంగా ఎంతో బాగా జరుగుతుందని అన్నారు. ధరణి పోర్టల్‌లో ముందుగానే ( అడ్వాన్స్‌గా) స్లాట్ బుకింగ్ చేసుకోవడంతో పాటు బయో మెట్రిక్ నిర్ధారణ, ప్రతి సర్వే నెంబర్‌కు మార్కెట్ విలువ నిర్ధారణ, రిజిస్ట్రేషన్లతో పాటు మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు సుంకం మొత్తం ఒక్కసారి పూర్తవుతున్నాయని అలాగే చెల్లింపులు సైతం ఆన్లైన్లోనే రైతులు చెల్లిస్తుండటం వల్ల ఎవరికీ ఒక్క రూపాయి ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరంలేకుండా ధరణి పోర్టల్ వల్ల ఎంతో ఉపయోగకరంగా మారిందని కలెక్టర్ హరీష్ తెలిపారు. అలాగే ఈ – పాస్‌పుస్తకంతో పాటు రైతులకు ఒనగూరే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలు అందేలా చేస్తుండటం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయని కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర, వ్యాప్తంగా ధరణిలో మంచి పురోగతి ఉందని హిట్ల సంఖ్య 5.17 కోట్లు, బుక్ చేసిన స్లాట్లు 10,45,878, పూర్తయిన లావాదేవీలు 10,00,973, విక్రయాలు 5,02,281, గిఫ్ట్‌డీడ్‌లు 1,58,215, వారసత్వంగా వచ్చినవి 72,085, తనఖా పెట్టినవి 58,285, పరిష్కరించబడిన ఫిర్యాదులు 5.17 లక్షలు, పెండింగ్ మ్యుటేషన్లు 2,07,229, భూసంబంధిత విషయాలపై ఫిర్యాదులు 1,73,718,
నిషేధించబడిన జాబితా 51,794, కోర్టు కేసులు ఇతర సమాచారం నిమిత్తం 24,618 ఉన్నాయని వివరించారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ధరణిలో విక్రయాలు 3,883, గిఫ్ట్ డీడ్ 650, వారసత్వం 611 ఉండగా పెండింగ్ మ్యుటేషన్లు 6,264, భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు 2,772, నిషేధించబడిన జాబితా 2,528, కోర్టు కేసులు సమాచారం వివరాలకు సంబంధించినవి 795 జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయిలో పరిష్కరించామని కలెక్టర్ వివరించారు. నిషేదిత భూముల విషయంలో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేసందుకు గ్రామాల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నెలరోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ హరీష్ జిల్లా ప్రజలను కోరారు. అలాగే నిషేదిత భూముల విషయంలో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేసందుకు గ్రామాల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నెలరోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు

Share This Post