జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ప్రభుత్వ విప్ శ్రీ గంప గోవర్ధన్ అన్నారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి శోభ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ శ్రీ గోవర్ధన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. పెట్టుబడి సాయం, భీమ వంటి సౌకర్యాలు కల్పించి దేశంలో మన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రెవిన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేసి భూ వివాదాలు సంయుక్త సర్వే ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. పోడు భూముల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేశామని చెప్పారు. అర్హతగల లబ్ధిదారులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ హనుమంత్ షిండే మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా విద్యుత్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో విద్యుత్ సమస్యలపై సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ అధికారులకు సూచించారు. జెడ్పీ సీఈవో సాయాగౌడ్ మాట్లాడారు. ప్రాథమిక పాఠశాల నుంచి 3 పాఠశాలలను యుపిఎస్ ( ఉచ్చతర ప్రాథమిక) పాఠశాలలుగా మార్చడానికి సభ్యులు ఆమోదం తెలిపారని చెప్పారు. 8 ఉచ్చతర ప్రాథమిక పాఠశాలలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మార్చడానికి సభ్యులు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. బిచ్కుంద, నాగిరెడ్డిపేట లోని ఆస్పత్రులలో వైద్యులను నియమించాలని సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి మరమ్మతులు చేపట్టాలని సభ్యులు కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా పంట పొలాలకు వెళ్లడానికి రోడ్లు వేయాలని సభ్యులు పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ కేంద్రం భవనాలను పూర్తిచేయాలని, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలకు మరమ్మతులు చేపట్టాలని సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. సమావేశంలో స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ శ్రీ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జిల్లా అటవీ అధికారిని నిఖిత, ఉమ్మడి జిల్లా డి సి సి బి చైర్మన్ భాస్కర్ రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. —————– జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.

Share This Post