జి.ఎం. కన్వెన్షన్ హాలులో పట్టణం అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్వర్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,

పత్రికా ప్రకటన 31.10.2021

వచ్చే జూన్ 2 వ తేది, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలోగా నల్లగొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు స్పష్టంగా మార్పు కనపడాలని రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి, ఐటి, శాఖబిమంత్రి కె. తారకరామారావు అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నాడు స్థానిక జి.ఎం. కన్వెన్షన్ హాలులో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్వర్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో కలిసి జిల్లాలోని మున్సిపాలిటీలలో, నల్లగొండ పట్టణంలో చేపట్టవలసిన పనులపై సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వచ్చే జూన్ 2, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లోగా నల్గొండ పట్టణంలో మీరు చేసే. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు స్పష్టంగా తెలియాలని, మున్సిపల్, రెవిన్యూ, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో నల్లగొండ పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దాలని అన్నారు. గత రెండు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ పట్టణం సందర్శించినప్పుడు ఆశించిన స్థాయిలో నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధి సాధించలేదని, దాని కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలనే ఆదేశాలతో తాము ఈరోజు రావడం జరిగిందని జరిగిందని అన్నారు. నల్లగొండ పట్టణంలో చేపట్టిన పాదయాత్రలో ప్రజలు, షాప్ యజమానులు ఇంకా ఏమి కోరుకుంటున్నారనే విషయాలు అడగడం జరిగిందని, మంచినీరు రెండు రోజులకు ఒకసారి తప్పనిసరిగా వస్తున్నాయని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం జరగడం లేదని, ఇన్వెస్టర్ల అవసరం కూడా లేనందున తీసివేయడం జరిగిందని తెలిపారని, అలాగే సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పకడ్బందీగా అమలు అవుతున్నాయని, ఆసరా పింఛన్లు టంఛన్ గా వస్తున్నాయని తెలిపారని, ఇంకా ఏమి మార్పు కావాలని అడిగితే, రోడ్ల పరిస్థితి బాగా లేదని, ఉపాధి అవకాశాలు తీసుకురావాలని, పరిశ్రమలు పెంచాలని సూచించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ కు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, పట్టణం లోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద 7 ఎకరాల స్థలంలో ఆడిటోరియం ఏర్పాటు చేయాలని ఆదేశించినందున ఆర్ అండ్ బి శాఖ వారు స్థల ప్రతిపాదనలు సిద్ధం చేస్తే మున్సిపల్ శాఖ వారు వెంటనే చర్యలు చేపట్టడం జరుగుతుందని, అందుకు ఆర్ అండ్ బి మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ల కోసం నల్లగొండ పట్టణంలో రెండు స్థలాలు వెతకాలని, అలాగే రైతు బజారు ఏర్పాటు కోసం రెండు చోట్ల స్థలాలు ఎంపిక చేయాలని, అర్బన్ లంగ్ స్పేస్ కోసం రెండు చోట్ల స్థలాలు ఎంపిక చేయాలని తెలిపారు. ఓపెన్ ప్లేస్ లు గుర్తించి యాదాద్రి మియావాకి లాగా వీలైతే ఎక్కువ చోట్ల అర్బన్ పార్కులు ఏర్పాటు చేయాలని సూచించారు. 1987 మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్
తయారుచేయాలని, మాస్టర్ ప్లాన్ లో తేడాలు ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని తెలిపారు. మునిసిపాలిటీలు ఆదాయం పెరిగే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వచ్చే ఆరు నెలల్లో నల్గొండ పట్టణ ప్రజలకు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో స్పష్టంగా వారికి మార్పు కనపడాలని, మొదటగా ఆరు ముఖ్యమైన జంక్షన్ లను ఫుట్ పాత్ లు, సర్వీస్ రోడ్లతో ఏర్పాటు చేయాలని, పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాల స్థానంలో కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్డు వెడల్పు చేసే చోట చెట్లను నరక వద్దని, అవసరమైన చోట జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో వాటిని వేరే ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వైకుంఠధామం, కబ్రిస్తాన్, సిమెట్రీలను సుందరీకరించాలని తెలిపారు. ఉదయ సముద్రం సుందరీకరణ, అర్బన్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. టి యు ఎఫ్ ఐ డి సి ద్వారా నల్లగొండకు 100 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ఇందులో 30 కోట్లు వివిధ పనులకు శాంక్షన్ చేశామని, మిగతా 70 కోట్లతో పనులకు టెక్నికల్ శాంక్షన్స్ పొందాలని సూచించారు. నేను ప్రతి రెండు నెలలకు ఒకసారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నెలకు ఒకసారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎన్. సత్యనారాయణ ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి పనులు పరిశీలిస్తామని తెలిపారు. నల్లగొండ చుట్టూ 50 ఎకరాలలో నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి టౌన్షిప్ ఏర్పాటు చేయాలని, తద్వారా మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని అధికారులను ఆదేశించారు. నల్లగొండ మున్సిపాలిటీ ఒక రోల్ మోడల్ గా నిలవాలని, జిల్లాలోని మిగతా మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉండాలనేది సీఎం గారి కోరిక అని అన్నారు. ప్రతి రోజు ఇంటింటికి మంచినీటి సరఫరా కోసం ఏమి చేయాలో మున్సిపల్ కమిషనర్ రమణాచారి అధికారులతో కలిసి పరిశీలించాలని ఆదేశించారు. నల్లగొండ పట్టణంలో రోడ్లు వెడల్పు సందర్భంగా వీధి వ్యాపారులను ఆదుకోవాలని, వారి కోసం వెండింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. మున్సిపల్, రెవిన్యూ, ఆర్ అండ్ బి, ఎలక్ట్రిసిటీ అధికారులు ప్రతివారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కన్వర్జెన్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. నల్లగొండ అభివృద్ధిలో భాగంగా సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్, మంచి సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి పట్టణ ప్రగతి కింద 72 కోట్ల 72 లక్షల కేటాయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ల కోసం 500 కోట్లు, వైకుంఠ ధామాలకు 200 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. మున్సిపాలిటీలకు సొంత ఆదాయం ద్వారా, టి ఎఫ్ ఐ డి సి ద్వారా, కేంద్ర గ్రాంటు ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక బడ్జెట్ ద్వారా నిధులు అందజేయడం జరుగుతుందని, ప్రతి మున్సిపాలిటీ సొంత ఆదాయం పెంచుకునేందుకు అన్ని మున్సిపాలిటీలలో ప్రభుత్వ స్థలాలు ఎంపిక చేసుకొని నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా టౌన్ షిప్ ల ఏర్పాటుతో ముందుకు వెళ్లాలని, ఎమ్మెల్యేలు మున్సిపల్ చైర్మన్లు, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కోరుకునేది చేయాలి కానీ, నేల విడిచి సాము చేయవద్దనే ముఖ్యమంత్రి ఆలోచనలు మీ ద్వారా ప్రతి ఫలించాలని అన్నారు. పారిశుద్ధ్యం, ఇంటింటి నుండి చెత్త సేకరణ, గ్రీన్ కవర్, టాయిలెట్స్ నిర్వహణ పకడ్బందీగా చేయాలని, పారిశుధ్య నిర్వహణలో అవసరమైనచోట అదనపు వాహనాలను వినియోగించుకోవాలని సూచించారు.

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ,
గౌరవ సీఎం గారి ఆదేశాలతో ఈరోజు రావడం జరిగిందని, టౌన్ హాల్ భూములకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆర్ అండ్ బి సూపరింటెండింగ్ ఇంజనీర్ ను ఆదేశించారు. పట్టణంలో నాలుగు వరసల రోడ్, ఫుట్ పాత్ ల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని, జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, సుందరీకరణ, వెడల్పు కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, రవీందర్రావు, శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భాస్కరరావు, రవీంద్రకుమార్, నోముల భగత్, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, రాష్ట్ర పురపాలన,పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రమా రాజేశ్వరి, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్ లు, రెవెన్యూ, ట్రాన్స్కో , ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.

Share This Post