జూన్ 2 నుండి 22 వరకు జరిగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను వివిధ సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

జూన్ 2 నుండి 22 వరకు జరిగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను వివిధ సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం తన పదో అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. క్రొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ భగీరథ, దళిత బంధు, రైతు బంధు, టీఎస్ ఐపాస్, ఆసరా పెన్షన్లు తదితర పథకాల అమలుతో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నామన్నారు. తెలంగాణ ఏర్పాటుతో గత తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతి పై ప్రణాళికాబద్ధంగా అన్ని శాఖలు స్పీచ్ తయారు చేసుకుని ఆయా తేదీలలో వారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలలో మాట్లాడాలని తెలిపారు. ప్రతి శాఖ వారిగా కార్యాచరణ చేసుకుని ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. పెన్షన్ల పంపిణీ, కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ,ఇండ్ల ప్లాట్ ల పంపిణీ, బిసి శాఖచే చెక్కుల పంపిణీ తదితర సంక్షేమ పథకాల పంపిణీ ఆయా శాఖల వారీగా సిద్ధం చేసుకోవాలన్నారు. జూన్ 2వ తారీఖున అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం తొమ్మిది గంటలకు ఐడిఓసి లో పతాకావిష్కరణ, ముఖ్య అతిథులుగా పాల్గొనే మంత్రి ద్వారా జండావిష్కరణ, సందేశం తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 3న రైతు దినోత్సవం సందర్భంగా రైతు వేదికల వద్ద వేయి మంది రైతులతో రైతు సంక్షేమం గురించి వారికి వివరించాలన్నారు. ముందస్తు వరి నాట్లు, పంట మార్పిడి లపై అవగాహన కల్పించాలన్నారు. రైతు వేదికలను తోరణాలు అందమైన లైట్లు ముస్తాబు చేయాలన్నారు. 4 న శాంతి భద్రతలపై స్నేహపూర్వకంగా ప్రజలతో కలిసిమెలిసి ఉండే పోలీసువారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించాలన్నారు. 5న విద్యుత్ విజయాలపై ప్రజలకు వివరించాలన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సబ్ స్టేషన్లు తదితర వాటిపై విద్యుత్ అధికారులు వివరించాలన్నారు. 6న పారిశ్రామిక విప్లవం ఐటి కారిడార్ తదితర కార్యక్రమాలపై పరిశ్రమల శాఖ వివరించాలన్నారు. 7న అధికారులు ఇరిగేషన్ కార్యక్రమాల ద్వారా ప్రజలకు సాగునీటి వసతులు తదితర కార్యక్రమాలపై ప్రొజెక్టర్ ద్వారా వివరించాలన్నారు. 8న ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఊరూర చెరువుల పండుగలో భాగంగా జిల్లాలోని చెరువుల పరిధిలో ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని, బోనాలు బతుకమ్మ తో వెయ్యి మంది రైతులు, ప్రజలు పాల్గొనేలా చేసి వారికి భోజనాలు పెట్టాలన్నారు. 9న సంక్షేమ సంబరాలలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఎంతమంది లబ్ధి పొందారు, జిల్లాలోని పూర్తి వివరాల సేకరించి వారిచే మాట్లాడించాలన్నారు. బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో కులవృత్తుల వారి వివరాలు సేకరించాలన్నారు. 10న సుపరిపాలన దినం పాటించాలని, డిపిఓ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలు కొత్తగా ఏవేవి ఏర్పాట్లు అయ్యాయో వాటి పై కరపత్రాలు పంపిణీ చేసి జరిగిన అభివృద్ధి వివరించాలన్నారు.11 న కవి సమ్మేళనం, 12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమం, 14న బస్తే దవాఖాన ఏర్పాటు వల్ల లాభాల గురించి వివరించాలని ఉత్తమ అంగన్వాడీ ఏఎన్ఎం లకు డాక్టర్లకు నర్సులకు సన్మానం చేయాలన్నారు. 15న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో చేపట్టిన కార్యక్రమాలను గ్రామపంచాయతీల దగ్గర డిపిఓ ఆధ్వర్యంలో నిర్వహించి ప్రజలకు వివరించాలన్నారు.16న పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీలలో నిర్వహించిన అభివృద్ధి పనులపై వివరించాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. పారిశుద్ధ్యం పచ్చదనం కార్యక్రమాలపై మాట్లాడాలన్నారు. 17న గిరిజన ఉత్సవం, 18న త్రాగునీటి సరఫరా, 19 తెలంగాణ హరిత ఉత్సవం గ్రీన్ సిటీ, 20న విద్యా దినం, 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినం, 22 న అమరవీరుల స్మరణ కార్యక్రమం చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్లు రాధిక గుప్తా, మయాంక్ సింగ్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అదనపు డిసిపి బోస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post