జూన్ 3వ తేదీ నుండి చేపట్టనున్న 5వ. విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమ సన్నాహక సమావేశం : జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన. తేది:31.05.2022, వనపర్తి.

జూన్ 3వ తేదీ నుండి చేపట్టనున్న 5వ. విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని, గ్రామాల రూపురేఖలు మారాలని, పల్లెలు అభివృద్ధి చెందాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి అధికారులకు సూచించారు.
మంగళవారం వనపర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై  జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో కలిసి ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని, జూన్ 3వ తేదీ నుండి జూన్ 18వ తేదీ వరకు చేపట్టనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి పరిచే విధంగా కార్యాచరణ రూపొందించి, వాటికి అనుగుణంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కృషి చేసి ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పారిశుద్ధ్యం, హరితహారం, నర్సరీలలో మొక్కలు నాటడం, విద్యుత్ మరమ్మత్తులు, లూజ్ లైన్ ల సవరింపు, విద్యుత్ స్తంభాలు సరిచేయడం, తడి, పొడి చెత్త ఇంటింటి నుండి ట్రాక్టర్ , రిక్షాలుతో విడి విడిగా సేకరించడం, డంపింగ్ యార్డ్ కు విద్యుత్ కనెక్షన్ , ఫెన్సింగ్, ప్రభుత్వ కార్యాలయాల్లో పూలు, పండ్ల మొక్కలు నాటించడం, సెగ్రిగేషన్ షెడ్ నిర్వహణ, తడి చెత్తను వర్మి కంపోస్టు తయారీ, వైకుంఠ ధామంలో విద్యుత్, త్రాగునీరు, మరుగు దొడ్లు, బయో ఫెన్సింగ్  సౌకర్యాలు సమకూరుస్తూ వినియోగంలోకి తీసుకురావడం, మిషన్ భగీరథ కనెక్షన్ ఇప్పించడం, పాడైపోయిన బోర్లు తొలగింపు , శిథిలావస్థకు చేరుకున్న బావులను ఉపాధి హామీ పధకంలో పూడిపించడం, మొక్కలు నాటేందుకు పిట్టింగ్ లు తీయించడం, అవెన్యూ ప్లాంటేషన్ లో అటవీశాఖ సహకారంతో ఎత్తైన మొక్కలు నాటించడం, ప్రభుత్వ భవనాల్లో పరిశుభ్రత, రోడ్ల పరిశుభ్రత, బోర్డులు పెట్టించడం, ప్రగతి బోర్డులను గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయించడం, గ్రామ పంచాయతీలలో  మొక్కలు నాటించడం, పల్లె ప్రకృతి, పట్టణ ప్రకృతి, బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు నిర్వహణ, గ్రామీణ పంచాయతిలకు క్రీడా మైదానాలు ఏర్పాటు వంటి కార్యక్రమాలు , గ్రామపంచాయతీ నిర్వహణ రిజిస్టర్ ల నమోదు, హాజరు విధానం తదితర అంశాలపై దృష్టి సారించాలని, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు, వ్యవసాయ అధికారులు, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. గ్రామాలను బెస్ట్ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ వనపర్తి జిల్లాకు ఒక కోటి మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ధారించడం జరిగిందని, ఇందులో భాగంగా ప్రభుత్వ ఖాళీ స్థలాలలో, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో, పాఠశాల ఆవరణలో, పొలాలలో, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని ఆమె సూచించారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని ఆమె తెలిపారు.
.        ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మున్సిపల్ స్పెషల్ అధికారి, జెడ్ పి కో ఆప్షన్ సభ్యులు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post