టీబీ వ్యాధిని అంతమొందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి:జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌

టీబీ వ్యాధిని అంతమొందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనిజిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.2024 నాటికి జిల్లాలో టీబీ వ్యాధి గ్రస్తులు లేకుండా నిర్మూలించాలని వైద్యులకు సూచించారు. టీబీ వ్యాధి లక్షణాల గురించి అందరికీ అవగాహన కల్పించాలని వైద్యులు సూచించారు. టీబీ వ్యాధి తగ్గాలంటే మందులు సక్రమంగా ఆరు నెలల పాటు వాడాలని కోరారు.అన్ని పరీక్షలు ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా చేస్తారని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సమావేశంలో వైద్య సిబ్బంది వెళ్లి టీబీ పై అవగాహన కల్పించాలని చెప్పారు.టీబీ నిర్ధారణ జరిగితే చికిత్స పూర్తయ్యే వరకు ప్రతి నెల ఐదు వందల రూపాయల చొప్పున పోషణ భత్యం ఇస్తారని పేర్కొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి లక్ష్మణ్ సింగ్ మాట్లాడారు. టిబి ఉన్న వారు మందులు వాడుతూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలని కోరారు. రెండు వారాలకు మించి ఎక్కువ రోజులు దగ్గు ఉంటే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో 1479 టీబీ కేసులు ఉన్నాయని తెలిపారు.1478 మంది మందులు వాడుతున్నారని చెప్పారు. వీరంతా ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది 6,081 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా 690 మందికి టిబీ కేసులు ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. టీబీ కరపత్రాలను ఆవిష్కరించారు. ఉత్తమ సేవలందించిన వైద్యులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపకలను అందజేశారు. అవగాహన సదస్సులో ప్రాంతీయ ఆసుపత్రి సూపర్డెంట్ విజయలక్ష్మి, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓలు చంద్రశేఖర్, శోభారాణి, ఐ.ఎం.ఎ. అధ్యక్షుడు ఏబీఎన్ రెడ్డి, కార్యదర్శి నవీన్ కుమార్, టీబీప్రోగ్రాం అధికారి ఇదిరిచ్ గోరీ, సమన్వయకర్తలు నీలిమ, శోభారాణి, అధికారులు పాల్గొన్నారు. —————– జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.

Share This Post