*డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి:: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

*డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి:: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

జనగామ, సెప్టెంబర్ 14: జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో చేపట్టిన డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. మంగళవారం పాలకుర్తి లోని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య తో కలిసి డబల్ బెడ్ రూం ఇండ్లు, ఇతర అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ. 113 కోట్ల 61 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 2 వేల 115 ఇండ్లు మూడు మండలాల్లో మంజూరు చేశామన్నారు. ఇందులో ఒక వేయి 936 ఇండ్లకు టెండర్ ప్రక్రియ పూర్తయి, పనులు ప్రారంభించగా, 397 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. పురోగతిలో ఉన్న నిర్మాణాల్లో పర్యవేక్షణ చేసి, పనులు పూర్తి చేయాలన్నారు. టెండర్ ప్రక్రియ కాని ఇండ్ల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్రామం వారీగా ఇండ్ల పురోగతిని సమీక్షించారు. ఇసుక అవసరమైన చోట సంబంధిత తహసీల్దార్ల సహకారం తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని దాదాపు ప్రతి గ్రామంలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. చిన్న చిన్న పనులు ఉన్నచోట వెంటనే పూర్తి చేసి, లబ్దిదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. లబ్దిదారులలో అసలైన పేదవారి జాబితానుండి ఎంపిక చేయాలన్నారు. జాబితా నోటీస్ బోర్డులో ప్రదర్శించాలన్నారు. ఎస్డీఎఫ్, సీడీఎఫ్ నిధుల్లో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనుల్లో అదనపు నిధులు అవసరమున్న చోట ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. సిసిరోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, చెక్ డ్యాం పనుల పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. చెక్ డ్యాం ల ఎత్తు పెంచాలని ఆయన తెలిపారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే, కాంట్రాక్టు రద్దుచేసి, మరొకరికి అప్పగించాలని అన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని మంత్రి అన్నారు. ప్రతి గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు.
సమీక్ష లో కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు సమన్వయంతో నిర్దేశిత కాలపరిమితి మేరకు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతామన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అబ్దుల్ హామీద్, డిపివో రంగాచారి, ఇంజనీరింగ్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post