డబుల్ బెడ్రూమ్ గృహసముదాయాల ప్రజలకు నిత్యావసర సదుపాయాలన్నీ అందుబాటులో ఉండేలా అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

అక్టోబరు,04, ఖమ్మం:

డబుల్ బెడ్రూమ్ గృహసముదాయాల ప్రజలకు నిత్యావసర సదుపాయాలన్నీ అందుబాటులో ఉండేలా అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ గృహసముదాయాలను సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గృహసముదాయంలో సుమారు 5 వేలకు పైగా జనాభా నివాసముంటారని, వారందరికి ప్రతిరోజు అవసరమయ్యే నిత్యవసర వస్తువులతో పాటు వైద్య సదుపాయాలు, ఇతర మౌళిక వసతులలో ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని, తదనుగుణంగా గృహప్రవేశాలకంటే ముందుగానే అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గృహసముదాయ కాలనీలో ఏర్పాటు. చేస్తున్న ఆరోగ్య ఉప కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, సూపర్ బజార్ ను సోమవారం సాయంత్రం కలెక్టర్ పరిశీలించారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేస్తున్న సూపర్ బజా ర్లో ప్రజలకు అవసరమైన అన్ని నిత్యవసరవస్తువులు అందుబాటులో ఉండాలని, నివాసితులు ఏ ఒక్క వస్తువుకోసం బయటకు వెళ్ళకుండా అన్ని వస్తువులను అందుబాటులో ఉంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, మహిళలకు కల్పిస్తున్న పూర్తి సౌకర్యాలను సమకూర్చుకోవాలని, అంగన్వాడీ కార్యకర్తలు, ఇతర సిబ్బందిని ముందుగానే కేటాయించి అంగన్వాడీ కేంద్రాన్ని సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా గృహసముదాయ కాలనీలో ఏర్పాటు చేస్తున్న ఆరోగ్య ఉప కేంద్రంలో అవసరమైన సిబ్బంది, వైద్యులు, ఏ.ఎన్. ఎమ్లు, ఆశా వర్కర్ల కేటాయింపు ప్రక్రియను రెండురోజులలోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీనితో పాటు ప్రతి ఇంటికి త్రాగునీరు సౌకర్యం ఎటువంటి అంతరాయం లేకుండా జరగాలని, ఎక్కువ వోల్టేజ్ గల వీధిలైట్లను అమర్చాలని, గ్రౌండ్ ఫ్లోర్లో అధికశాతం వికలాంగులకు కేటాయిస్తున్నందున ప్రతి ఇంటికి ర్యాంప్ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ గృహసముదాయాల ప్రవేశ మార్గం ఆర్చి తో పాటు  మిగులు పనులను రెండురోజులలోపు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు అన్ని బ్లాక్ల గృహాలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు శ్యాంప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు రంజిత్ కుమార్, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పుష్పలత, జిల్లా సంక్షేమ శాఖాధికారి సంధ్యారాణి, జిల్లా సర్వేలెన్స్ అధికారి డా॥రాజేష్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, గుత్తేదారులు, గోవర్టన్ రెడ్డి , సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post