డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి- జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

ఇప్పటివరకు పనులు ప్రారంభం కానీ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలి

– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

————————————–

సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో ఇండ్లు మంజూరై ఇప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభంకానీ డబుల్ బెడ్ రూం ఇండ్లను గుర్తించి, వెంటనే పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

గురువారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, సిరిసిల్ల, తంగళ్ళపల్లి, ముస్తాబాద్, వీర్నపల్లి, గంభీరావుపేట, తహశీల్దార్లతో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాల ప్రారంభం, వేగవంతానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.

మండలాల వారీగా సుదీర్ఘంగా సమీక్షించిన కలెక్టర్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు, గ్రామ సభల నిర్వహణ, లబ్దిదారుల ఎంపిక, తదితర అంశాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గానికి 4 వేల 429 రెండు పడక గదుల ఇండ్లు మంజూరయ్యాయని, ఇందులో 3 వేల 178 ఇండ్లు ఇప్పటికే పూర్తికాగా మిగతావి వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయని అన్నారు.

కొన్ని గ్రామాల్లో ఇండ్లు మంజూరైన కూడా ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభించలేదని వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే వివిధ దశల్లో ప్రగతిలో ఉన్న ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు.

లబ్దిదారులను ఎంపిక చేయని గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి లబ్దిదారుల ఎంపిక పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. వచ్చే వారంలోగా ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, తహశీల్దార్ల ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి, టెండర్లు పిలిచి, నిర్మాణ పనులు ప్రారంభించేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.

సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్, ఇంఛార్జి డీఆర్ఓ టి.శ్రీనివాస రావు, ఆర్ & బి ఈఈ శ్యామ్ సుందర్, పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాశ్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ విరూపాక్ష, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ జానకి, మండల తహశీల్దార్లు, ఏఈ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post