డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి :: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 2:

జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఖమ్మం మునిసిపల్ పరిధిలో చేపడుతున్న ఇండ్ల నిర్మాణాల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. వైఎస్ఆర్ నగర్ లో 4 బ్లాకుల్లో జిప్లస్ 2 లో చేపడుతున్న 96 ఇండ్లను ఆయన పరిశీలించారు. 2 బ్లాకుల్లో 48 ఇండ్ల నిర్మాణం పూర్తగు దశలో ఉన్నట్లు, చిన్న చిన్న పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. మిగులు ఇండ్లలో లేబర్ ని పెంచాలని ఆయన సూచించారు. అనంతరం కేసీఆర్ కాలనిలో నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులకు అందజేసిన గృహ సముదాయాన్ని పరిశీలించారు. బ్లాకుల్లో ఇంటింటికి తిరిగి కేటాయించిన గృహాల్లో సంబంధిత లబ్ధిదారులు ఉంటున్నది లేనిది విచారణ చేశారు. నివాసముంటున్న షేక్ బియా ని ఎంతమంది ఉంటున్నది, సౌకర్యాలు ఎలా ఉన్నవి, గృహాలు ఎలా ఉన్నవి, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అడగగా, సమస్యలు లేవని, కరంట్, త్రాగునీరు వస్తుందని ఆనందంగా ఉన్నట్లు సమాధానమిచ్చారు. అనంతరం అల్లీపూర్ 6 బ్లాకుల్లో నిర్మిస్తున్న 144 ఇండ్ల1నిర్మాణాలు తనిఖీ చేశారు. ఇటుక, ప్లాస్టింగ్ పనులు జరుగుతున్నట్లు, వాటితో పాటు సమాంతరంగా సానిటరీ, నీటిసరఫరా, తలుపులు, కిటికీల పనులు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. అనంతరం మల్లెమడుగు గ్రామంలో 8 బ్లాకుల్లో నిర్మిస్తున్న 192 గృహ నిర్మాణాలు ఆయన తనిఖీ చేశారు. బ్లాకుకు 24 చొప్పున 5 బ్లాకుల్లో నిర్మాణాలు పూర్తి కాగా, మిగతా 3 బ్లాకుల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. డ్రైనేజీ పనులు నడుస్తున్నట్లు, ఆగస్టు నెలాఖరులోగా సిసి రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. సానిటరీ, విద్యుత్ సంబంధ సామాగ్రి పూర్తిగా అందినది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ అధికారులు పనుల పూర్తికి వ్యక్తిగత శ్రద్ధ వహించాలని, పనుల పురోగతిపై రోజువారీ సమీక్షలు చేశాలని ఆయన అన్నారు.

కలెక్టర్ పర్యటన సందర్భంగా డిఆర్వో శిరీష, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ ఇఇ తానాజి, డిఇ రాజు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, అధికారులు తదితరులు ఉన్నారు.

Share This Post