డబుల్ బెడ్ రూం కాలనీల్లో అదనపు మౌళిక సదుపాయాల కల్పన కు చర్యలు :: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 2:

జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీల్లో అదనపు మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డబుల్ బెడ్ రూం కాలనీల్లో అదనపు మౌళిక సదుపాయాల కల్పనకు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలోని 56 కాలనీల్లో విద్యుద్దీకరణ పనులు పూర్తయినట్లు, 45 చోట్ల పూర్తి చేయాల్సివున్నట్లు ఆయన అన్నారు. త్రాగునీటి పనులు 20 కాలనీల్లో పూర్తికాగా, 81చోట్ల పూర్తి చేయాల్సి ఉందన్నారు. సెప్టిక్ ట్యాoక్, సీవరేజ్ పనులు 10 చోట్ల పూర్తికాగా, 91 కాలనీల్లో పెండింగ్ ఉన్నాయని కలెక్టర్ అన్నారు. నిర్మాణాలు పూర్తయి, లబ్ధిదారులకు అందించడానికి సిద్ధంగా ఉన్న కాలనీల్లో అదనపు మౌళిక సదుపాయాల కల్పన పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని కలెక్టర్ అన్నారు. పనులు చివరిదశలో ఉన్నచోట, మిగులు పనులతోపాటు సదుపాయాల కల్పనకు చర్యలు సమాంతరంగా చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ మొగిలి స్నేహాలత, డిఆర్వో శిరీష, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post