డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయాలి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హుల తుది జాబితా సిద్ధం చేయాలి……. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయాలి

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హుల తుది జాబితా సిద్ధం చేయాలి……. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం లో భాగంగా జిల్లాలో పూర్తయిన ఇండ్లను అర్హులకు కేటాయించడానికి అర్హుల తుది జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో హౌసింగ్ ,ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పురోగతి, అర్హుల జాబితా, ప్రారంభానికి సంసిద్ధత, తదితర అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలని, అర్హులకు మాత్రమే అందించాలన్నారు. ఎలాంటి ఆక్షేపణలు లేకుండా సజావుగా అర్హులకు అందేలా చూడాలని తెలిపారు.
పూర్తయిన ఇండ్లకు లబ్ధిదారుల తుది జాబితా తయారు చేసి, ప్రారంబాలకు సిద్ధం చేయాలని సూచించారు.

లబ్ధిదారులకు అందించడానికి అందోల్ నియోజకవర్గంలో ఢాకూర్ గ్రామంలో 104, అందోల్ నగర పంచాయతీలో 216, అందోల్ వడ్డెర మరియు హమాలీ కాలనీలో 108, కంకోల్ లో 96, మునిపల్లీ 72 ఇండ్లు, నారాయణఖేడ్ నియోజకవర్గం జూకల్ లో 130, జహీరాబాద్ నియోజకవర్గం లో జహీరాబాద్ రహమత్ నగర్ లో 312, సంగారెడ్డి నియోజక వర్గం లో సంగారెడ్డి మున్సిపాలిటీకి ఫసల్ వాది లో 265, కలబ్ గూర్, ఫసల్ వాది గ్రామాలలో 64 ఇండ్లు విద్యుత్, తాగునీరు, రోడ్లు ,మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్, తదితర అన్ని వసతులతో పూర్తయ్యాయని తెలిపారు. అట్టి ఇండ్ల కేటాయింపునకు అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు.

అర్హుల/ అనర్హుల తుది జాబితాను వెంటనే ప్రదర్శించాలని, జాబితాలో ఏవేని అభ్యంతరాలు ఉన్నట్లయితే నిర్ణీత సమయంలోగా తెలియజేయాలని సంబంధిత గ్రామ ప్రజలకు తెలిసేలా నోటీస్ బోర్డ్ లో రాసి పెట్టాలని, అదేవిధంగా దండోరా వేయించాలన్నారు. ఒక డబ్బా ను ఏర్పాటు చేసి అభ్యంతరాలను అందులో వేయాలని సూచించాలన్నారు. నిర్ణీత సమయం ముగిసిన వెంటనే జిల్లా అధికారులు ,ఇతర బృందాలతో పూర్తిస్థాయిలో విచారణ చేయించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. జాప్యం లేకుండా పూర్తయిన ఇండ్లను అర్హులకు అందించేలా ఆయా అధికారులు చొరవ చూపాలని ఆయన కోరారు.

పటాన్చెరు నియోజకవర్గంలో నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, హౌసింగ్ నోడల్ అధికారి మరియు డి సి ఓ తుమ్మ ప్రసాద్, ఆర్ అండ్ బి ఈ ఈ, పంచాయతీరాజ్ ఈ ఈ, రెవిన్యూ డివిజనల్ అధికారులు నాగేష్, అంబదాస్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post