డాక్టర్ల కృషి మరువలేనిది

ప్రచురణార్థం

డాక్టర్ల కృషి మరువలేనిది

మహబూబాబాద్ డిసెంబర్ 14.

కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డొస్ 100% సాధించడంలో డాక్టర్ల కృషి మరువలేనిదని రాష్ట్ర గిరిజన,సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు.

కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డొస్ 100% సాధించి రాష్ట్రంలోనే 10వ స్థానం చేరుకున్న శుభ సందర్భంలో మంగళవారం రోడ్లు, భవనాలు అతిథి గృహ ఆవరణలో డాక్టర్లకు అభినందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ శశాంక అధ్యక్షతన మంత్రి నిర్వహించారు.

ఈ శుభ సందర్భం ను పురస్కరించుకొని మంత్రి కేక్ కట్ చేసి అధికారులకు, డాక్టర్ల కు తినిపించారు.

ఈ అభినందన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతమని అందులోనూ జిల్లాలోనే అత్యంత మారుమూల మండలాలైన కొత్తగూడ, గంగారం సిగ్నల్ లేని ప్రాంతాలని అటువంటి ప్రాంతాలలోనే ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ చేసి నూరు శాతం సాధించడం తో వైద్యులను ప్రత్యేకంగా అభినందించారు.

తొలుత కోవిడ్ వచ్చినప్పుడు వైద్య సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అయినా ఆత్మవిశ్వాసంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా నడిపించడంలో జిల్లాను ముందంజ లో ఉంచుతూ, నిరంతరం సమీక్షిస్తూ, అధికారులను ప్రోత్సహిస్తూ వంద శాతం పూర్తి చేయటంలో జిల్లా కలెక్టర్ శశాంక విజయవంతమయ్యారని మంత్రి అన్నారు. ఇదే స్ఫూర్తితో రెండవ డోసు 100 శాతం పూర్తి చేయాలన్నారు.

రైతుల ధాన్యం తప్పనిసరిగా కొనుగోలు చేస్తామని, యాసంగి లో పండించే ధాన్యం భారత ఆహార సంస్థ కొనుగోలు చేయమని చెప్పినందున రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు చేపట్టి ఆర్థిక అభివృద్ధి సాధించాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ, జిల్లాలో 18 సంవత్సరములు దాటిన వాళ్ళు 5.63 లక్షల మందికి గాను 5.65 లక్షల మందికి వ్యాక్సిన్ వేసి 101 శాతంతో ఉన్నామన్నారు. అదేవిధంగా రెండవ డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 3. 20 లక్షల మందికి వేసి 56% గా ఉన్నామని, ప్రణాళికాబద్ధంగా చేపట్టినందున విజయానికి చేరువ అవుతున్నామని తెలియజేశారు. కోవిద్ వ్యాక్సిన్ తీసుకున్నామని నిర్లక్ష్యం తగదని, ఓమిక్రాన్ మరోవైపు పొంచివుందని మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటించాలన్నారు.

అనంతరం మంత్రి వైద్య సిబ్బందిని సన్మానించారు.

అభినందన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు వెంకట రాములు, జిల్లా టీఎన్జీవోస్ నాయకులు వడ్డెబోయిన శ్రీనివాస్, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
———————————————————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post