డిసెంబర్ నెలాఖరుకల్లా మినీ స్టేడియం పనులు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 27: డిసెంబర్ నెలాఖరుకల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న మినీ స్టేడియం నిర్మాణ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ మున్సిపల్ అధికారులతో కలిసి మినీ స్టేడియం నిర్మాణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టేడియంలో రన్నింగ్ ట్రాక్, టెన్నిస్ కోర్టు, వాలీబాల్ కోర్టు, ఎంట్రీ ఆర్చ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. డిసెంబర్ చివరి కల్లా పూర్తిస్థాయిలో స్టేడియం నిర్మించి, ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలన్నారు.
వేములవాడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వైకుంఠధామం నిర్మాణంలో వేగం పెంచాలి
వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో పాత మార్కెట్ యార్డు ప్రదేశంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ యార్డు నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 2 ఎకరాల స్థలంలో 4 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న మార్కెట్ యార్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. పాత భవనం కూల్చివేత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అనంతరం ఆయన వైకుంఠధామం నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరగా నిర్మాణం పూర్తి చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు వ్యక్తిగత శ్రద్ధ వహించి, ప్రతిరోజు పనుల పురోగతిని పర్యవేక్షించాలని అన్నారు. పనుల పూర్తిలో అలసత్వం సహించేది లేదని, చర్యలుంటాయని అధికారులను హెచ్చరించారు. తదనంతరం వేములవాడ పట్టణంలోని చామకుంట వద్ద 2 కోట్ల 70 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ సందర్శనల్లో కలెక్టర్ వెంట సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య, వేములవాడ మున్సిపల్ కమీషనర్ శ్యామ్ సుందర్ రావు, డీఈఈ సుచరన్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post