డిసెంబర్ 31వ. తేదిలోపు 100% వాక్సినేషనేషన్ పూర్తి చేయాలి : వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, ఐటీ, పురపాలక శాఖ, విద్యాశాఖ మంత్రి హరీష్ రావు, కెటిఆర్, సబిత ఇంద్రరెడ్డి

పత్రిక ప్రకటన.      తేది:1.12.2021, వనపర్తి.

డిసెంబర్ 31వ. తేది లోపు వంద శాతం వాక్సినేషనేషన్ పూర్తి చేయాలని, అన్ని గ్రామాలు, మండలాలు, మున్సిపల్ వార్డులలో  ప్రత్యేక క్యాంపులను ఏర్పాటుచేసి మొదటి, రెండవ డోసులు    వాక్సినేషనేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు.
బుధవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, వైద్య అధికారులు, పంచాయతీ అధికారులతో వ్యాక్సినేషన్ పై రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్ గార్లతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కొత్త వెరియంట్ ఒమ్రికాన్ అనే కొత్త వారియెంట్ కొన్ని దేశాల్లో బయట పడిందని, ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ముందస్తుగా ప్రతి ఒక్కరు రెండు డోసులు కోవిడ్ వాక్సిన్ తీసుకోవటం పూర్తిచేయాలని ఆయన సూచించారు. వాక్సిన్ తీసుకోని వారంతా కోవిడ్ బారిన పడే ప్రమాదం ఉందని, కొవిడ్ మూడవ దశ ఎదుర్కొనేలా సంసిద్ధంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ వైద్య సిబ్బందికి సహకరించి వ్యాక్సినేషన్ రెండు డోసు లు డిసెంబర్ 31 నాటికి వంద శాతం పూర్తి చేసేలా స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఎక్కడ అయితే తక్కువ వ్యాక్సిన్ వేశారో గుర్తించి జిల్లా కలెక్టరులు, వైద్య అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పూర్తి చేయాలని ఆయన సూచించారు.
గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీ వార్డులలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయుటకు అన్ని చర్యలు చేపట్టాలని, ఆరోగ్య పరమైన రోగనిరోధకశక్తిని పెంచే విధంగా ప్రజలలో అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. దేశములోనే  వంద  శాతం వాక్సినేషన్ పూర్తి చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు ఉంచేందుకు కలెక్టర్లు, వైద్య అధికారులు, సిబ్బంది కృషి చేయాలనీ మంత్రి సూచించారు. మొదటి, రెండు డోస్ లు ప్రతి జిల్లాలో వంద శాతం పూర్తి చేయాలని, వాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు కోవిడ్  టీకా తీసుకునేలా చూడాలని ఆయన తెలిపారు. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ప్రతి గ్రామాన్ని, మండలాన్ని, మున్సిపల్ వార్డును, జిల్లాను వంద శాతం వ్యాక్సిన్ పూర్తయిన జిల్లాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రజలు కృషి చేయాలని మంత్రి వివరించారు.
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ మనమందరం మొదటి రెండు దశల ద్వారా పొందిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మూడవ దశ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మూడవ  దశను ఎదుర్కొనేందుకు సన్నద్దం కావాలని, అసత్య ప్రచారాలు, అపోహలు ప్రజలు నమ్మకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా మీకు అందుతున్న సమాచారం ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలలో ఎన్ని బెడ్స్, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయన్న సమాచారం ప్రజలకు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి మాట్లాడుతు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైనందున కోవిడ్ నిబంధనలు పాటిస్తూ  గురుకులాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు. టీచింగ్, నాన్  టీచింగ్ సిబ్బంది అందరూ రెండు డోసులు వాక్సినేషన్ తీసుకోనేలా చర్యలు చేపట్టాలని, విద్య సంస్థలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టర్లు విద్యా శాఖ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని, 18సంవత్సరాలు నిండిన విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకునేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ  జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసి, 100% వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని, మూడవ దశ రాకుండా  తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సం గ్వాన్, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, డి ఎం హెచ్ ఓ చందు నాయక్, అడిషనల్ డి ఎం హెచ్ ఓ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, డీఈవో రవీందర్, డి ఆర్ డి ఓ నరసింహులు, డి పి ఓ సురేష్ కుమార్, డాక్టర్ రవి శంకర్, డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, డాక్టర్ రామ్ చందర్, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ రామంజ, కొత్తకోట, పెబ్బేర్, అమరచింత మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన వారు 4 లక్షల 27 వేల 849 మంది ఉన్నారని, మొదటి డోసు వ్యాక్సినేషన్ 3 లక్షల 68 వేల 210 మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారు ఉన్నారని ఆమె సూచించారు. ఇంకా వ్యాక్సినేషన్ పూర్తి కాని వారిని ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని ఆమె తెలిపారు. కళాశాలల్లో స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేలా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారికి, డి ఈ ఓ.కు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 255 గ్రామ పంచాయతీలలో సర్పంచులు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయుటకు కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రతి శాఖలోని సిబ్బంది అందరూ వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తి చేసుకోవాలని ఆమె తెలిపారు.
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి చందు నాయక్ మాట్లాడుతూ జిల్లాలో డయాగ్నస్టిక్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఈ సెంటర్ ద్వారా ఉచిత పరీక్షలు చేయించుకోవచ్చునని, దీని ద్వారా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
…………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post