డిసెంబర్ 31వ తేది వరకు మొదటి, రెండో డోసు వంద శాతం పూర్తి చేయాలి – రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

డిసెంబర్ 31వ తేది వరకు మొదటి, రెండో డోసు వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను, వైద్య అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశించారు.

బుధవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య అధికారులు, పంచాయతీ అధికారులతో వ్యాక్సినేషన్ పై రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్ గార్లతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కొత్త వెరియంట్ ఒమ్రికాన్ వచ్చినందున మూడవ దశ ఎదుర్కొనేలా సంసిద్ధంగా ఉండాలన్నారు. వ్యాక్సినషన్ రెండు డొసులు వంద శాతం పూర్తి ఈ నెల 31 వరకు పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడ అయితే తక్కువ వ్యాక్సిన్ వేశారో గుర్తించి జిల్లా కలెక్టరులు, వైద్య అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పూర్తి చేయాలని సూచించారు. గ్రామాలు, మండలాలు, వార్డులు, మున్సిపాలిటీ లలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయుటకు పోటీ తత్వం పెంచాలని సూచించారు.

రాష్ట్రంలో మొదటి డోసు తొంబై శాతం పూర్తి అవడానికి వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీ శాఖలు సమన్వయంతో పని చేయడం వల్ల సాధ్యమైనదని అన్నారు. దేశములోనే వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు ఉంచేందుకు కలెక్టరులు, వైద్య అధికారులు, సిబ్బంది కృషి చేయాలనీ మంత్రి సూచించారు. మొదటి, రెండు డోస్ లు ప్రతి జిల్లాలో వంద శాతం పూర్తి చేయాలని, వాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా తీసుకునేలా చూడాలని తెలిపారు. ప్రతి గ్రామాన్ని, మండలాన్ని, మున్సిపల్ వార్డును, జిల్లాను వంద శాతం వ్యాక్సిన్ అయినట్లుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. మీ జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, స్పెషల్ అధికారులను నియమించాలని ఆదేశించారు.

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ మనమందరం మొదటి రెండు దశల ద్వారా పొందిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మూడవ దశ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మూడవ దశను ఎదుర్కొనేందుకు సన్నద్దం కావాలని, అసత్య ప్రచారాలు, అపోహలు ప్రజలు నమ్మకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా మీకు అందుతున్న సమాచారం ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలలో ఎన్ని బెడ్స్, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయన్న సమాచారం ప్రజలకు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసి పరిధిలో 25 లక్షల మందికి రెండో డోసు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని, అందుకు తగిన చర్యలు తీసుకోని పూర్తి చేయుటకు కృషి చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతు స్కూల్స్, కాలేజీలు ప్రారంభమైనందున గురుకులాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది అంత రెండు డోసులు వాక్సినేషన్ తీసుకున్నారని తెలిపారు, విద్య సంస్థలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 18సంవత్సరాలు నిండిన విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలి అని అన్నారు.

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు మాట్లాడుతూ జిల్లాలో మొదటి డొసు 24 లక్షల 88 వేల 353 మందికి 112 శాతం వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. రెండో డోసు 15 లక్షల 82 వేల 052 మందికి 63 శాతం ఇవ్వడం జరిగిందని తెలిపారు. మొదటి డోస్ వంద శాతం పూర్తి చేయుటకు చేపట్టిన విదంగానే కార్యక్రమాలు చేపట్టి త్వరగా రెండో డోస్ వంద శాతం పూర్తి చేయుటకు కృషి చేస్తామని, మూడవ దశ రాకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని ముందుకు వెళ్లతామని మంత్రికి తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డి ఆర్ డి ఏ పిడి ప్రభాకర్, జిల్లా పరిషత్ సీఈఓ దిలీప్ కుమార్, జిల్లా విద్యా శాఖ అధికారి సూసిందర్ రావు, వైద్య అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post