డిసెంబర్ 31వ తేదీ లోగా 100 శాతం వ్యాక్సినేషన్ వేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు తెలిపారు.

బుధవారం నాడు కేబినెట్ సబ్ కమిటీ చైర్మెన్ మంత్రి టి. హరీష్ రావు సబ్ కమిటీ మెంబర్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు,  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్,  రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.ఎ.ఎం. రిజ్వీ,  రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్,  రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ ఎ. శరత్,  అధికారులతో కలిసి  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు,  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లు,  మున్సిపల్ చైర్ పర్సన్లు,  జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు,  జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు,  జిల్లా పంచాయతీ అధికారులతో కోవిద్ వ్యాక్సినేషన్ పై జిల్లాల వారీగా సమీక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా సబ్ కమిటీ చైర్మన్,  మంత్రి టి.హరీష్ రావు మాట్లాడుతూ,  కొత్త వైరస్ ను ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ ఒకటే మార్గమన్న గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా  రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకొనేలా జిల్లా కలెక్టర్లు, జిల్లా ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ఈ నెల 31వ తేదీ లోగా 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని,  జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని తెలిపారు.  ఇప్పటి వరకు  93 శాతం మొదటి డోస్‌, 46 శాతం రెండవ డోసు పూర్తి  చేసుకున్నామని తెలియజేస్తూ మున్సిపల్, పంచాయతీరాజ్,  వైద్య ఆరోగ్య శాఖ  క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో పి హెచ్ సి,  సబ్ సెంటర్ల వారీగా వేగంగా వ్యాక్సినేషన్ చేపట్టాలని తెలిపారు. రాబోయే సమస్యలు తట్టుకోవాలంటే, ప్రజలను కాపాడుకోవడానికి వ్యాక్సిన్ ఒకటే మార్గమని అన్నారు.  రాష్ట్రంలో వ్యాక్సిన్ సరిపోను అందుబాటులో ఉందని తెలిపారు.  మా గ్రామం , మా వార్డు,  మా మండలం 100 శాతం వ్యాక్సినేషన్ అయిపోయింది అనే దృక్పథంతో అధికారులు,  ప్రజాప్రతినిధులు పని చేయాలని,  ప్రజల్లో విశ్వాసం నెలకొల్పాలని కోరారు.  పట్టణాలలో,  గ్రామ పంచాయతీలలో  చెత్త వాహనాల ద్వారా వ్యాక్సినేషన్ తీసుకోవాలనే ఆడియో ప్రచారం చేపట్టాలని, గ్రామాలలో వ్యాక్సినేషన్ తీసుకోవాలంటూ టాంటాం చేపట్టాలని తెలిపారు.  వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులతో కలిసి జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు ఆరోగ్య కేంద్రాల వారీగా పరిశీలించి తక్కువ వ్యాక్సిన్ నమోదు అయిన చోట వేగం పెంచాలని,  థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకునేలా ప్రజలను సంపూర్ణ వ్యాక్సినేషన్ వేయడమే లక్ష్యంగా పని చేయాలని తెలిపారు.  అన్ని ప్రభుత్వ,  ప్రైవేటు కాలేజీ లో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క విద్యార్థికి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకునేలా అధికారులు పనిచేయాలని తెలిపారు.
కేబినెట్ సబ్ కమిటీ మెంబర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు మాట్లాడుతూ, కోవిద్ మొదటి రెండు దశలను చూశామని,  ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని, సవాళ్ల నుండి మనం నేర్చుకున్నది మూడవ దశ వస్తే ప్రజా ప్రతినిధులను సన్నద్ధం చేసే విధంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రజలు ఎలాంటి  అసత్య ప్రచారాలు నమ్మకుండా,  ప్రభుత్వ సమాచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు ప్రతి రోజు మీడియా ద్వారా ప్రజలకు,  ప్రజా ప్రతినిధులకు అందించాలని తెలిపారు. వ్యాధి కంటే భయం వలన నష్టం ఎక్కువ జరుగుతుందని అన్నారు.  జిల్లా కలెక్టర్,  జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు సంయుక్తంగా ప్రతిరోజు తమ పరిధిలో ఎన్ని బెడ్స్ అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి వైద్య సదుపాయాలు, వసతులు ఉన్నాయి అనేది పూర్తి సమాచారంతో ప్రజలకు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.  టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు పని చేయాలని తెలిపారు. గతంలో ఫీవర్ సర్వే చేసిన విధంగా యుద్ధ ప్రాతిపదికన 100 శాతం వ్యాక్సినేషన్ కోసం అన్ని చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సూచించారు.
కేబినెట్ సబ్ కమిటీ మెంబర్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ,  గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో 95 శాతం టీచింగ్,  నాన్ టీచింగ్ సిబ్బంది,  50 శాతం మంది విద్యార్థులు వ్యాక్సినేషన్ వేసుకున్నారని తెలియజేస్తూ  రెండు రోజుల్లో 100 శాతం వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు.  అలాగే హాస్టల్స్, విద్యాసంస్థలలో  కోవిద్ నిబంధనల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ,  మొదటి డోసులో 93 శాతం,  రెండవ డోసులో 46 శాతం వ్యాక్సినేషన్ సాధించడం జరిగిందని,  ప్రతి పి హెచ్ సి,  సబ్ సెంటర్ లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకునేలా, ఎక్కువ తేడాలు ఉన్న చోట ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, ప్రతి శాఖలో సిబ్బంది అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకునేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,  జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ,  జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివరావు,  జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి,  జిల్లా పంచాయతీ అధికారి సునంద,  మున్సిపల్ కమిషనర్లు,  వైద్య అధికారులు పాల్గొన్నారు.

డిసెంబర్ 31వ తేదీ లోగా 100 శాతం వ్యాక్సినేషన్ వేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు తెలిపారు.

Share This Post