ఆదివారం నర్సింగ్ కళాశాల, జిల్లా ఆసుపత్రి, రామవరం మాతా శిశు ఆసుపత్రులను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 7వ తేదీ వరకు పూర్తిస్థాయిలో అన్ని పనులు పూర్తి చేయాలని, పనులను సత్వరం పూర్తి చేయుటకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పారు. తక్కువ తక్కువ సిబ్బందితో పనులు సకాలంలో పూర్తి కావని, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పారు. 5 ఎకరాల్లో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాలకు ప్రభుత్వం 5 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. నర్సింగ్ కళాశాల ప్లింత్ భీం పనులను నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. నిర్మాణ పనులకు ప్రత్యామ్నంగా డోర్లు, కిటికీలు ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. మెటీరియల్ కొరత రాకుండా సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. పనులను వేగవంతం చేసేందుకు నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రగతి నివేదికలు ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనులను వేగవంతంగా ఎందుకు చేపట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతతో జిల్లాకు వైద్య, నర్సింగ్ కళాశాలలు మంజూరు చేసిందని, ప్రాధాన్యతను గమనంలోకి తీసుకుని చేపట్టాల్సిన పనుల వారిగా షెడ్యూలు తయారు చేసి వైద్యాధికారులు, టిఎస్ఇస్ఐసి ఇంజనీరింగ్ అధికారులు సంయుక్త ధృవీకరణతో తనకు అందచేయాలని చెప్పారు. మీ టీం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని, ఇలా నెమ్మదిగా పనులు చేసుకుంటూ పోతే నడవదని, మీరు చేయకపోవడం వల్ల కొన్ని రోజులు పనులను తకోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. నిర్లక్ష్యం వల్లనే పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు గమనించామని, ప్రాధాన్యతను గమనించి ఇకనుండైనా పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. 24 గంటలు నిరంతరాయంగా ప్రత్యాయ పనులు చేపట్టేందుకు వీలుగా 150 నుండి 200 మంది పనివారలతో పనులు చేపించాలని చెప్పారు. జరుగుతున్న పనులకు ప్రతి రోజు తనకు అప్డేట్ చేయలని ఆసుపత్రుల సమన్వయ అధికారిని, పర్యవేక్షకురాలుని ఆదేశించారు. అన్ని జిల్లాలలో పనులు వేగంగా జరుగుతుంటే సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల మన జిల్లాలో జాప్యం జరుగుతున్నదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ పనులతో పాటు ప్లబింగ్, విద్యుత్ ఏర్పాటు పనులు ప్రత్యామ్నయంగా చేపట్టాలని చెప్పారు. వైద్య కళాశాలకు 330 బెడ్లు అవసరం ఉన్నందున నర్సింగ్ కళాశాలలో 100, రామవరంలోని మాతాశిశు కేంద్రంలో 100, జిల్లా ఆసుపత్రిల్లో 130 బెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. రానున్న వారంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జిల్లాలో పర్యటించి పనులను తనిఖీ చేసే అవకాశం ఉన్నదని ఆయన తెలిపారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో పాటు మనందరం కల్సి కట్టుగా చేస్తేనే సకాలంలో పనులను పూర్తి చేయగలనిమని చెప్పారు. ఏమైనా సమస్యలుంటే తక్షణం తన దృష్టికి తీసుకురావాలని యంత్రాంగం పరంగా అన్ని సహాయ, సహాకారాలు అందిస్తామని చెప్పారు. రామవరంలో నిర్మిస్తున్న మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి హద్దులను కేటాయించాలని తహసిల్దార్ను ఆదేశించారు. ఆసుపత్రికి కేటాయించిన స్థలంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించు విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అదనపు పనివారలు ఏర్పాటు ద్వారా పనులను వేగవంతం చేయాలని చెప్పారు. ఆసుపత్రి ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో అందమైన మొక్కలతో సుందరంగా పార్కును తయారు చేయాలని చెప్పారు. ఆసుపత్రి పరిసరాలల్లో పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరణం చాలా ముఖ్యమని చెప్పారు. ఆసుపత్రికి వెళ్లే రహదారికి ఇరువైపులా నీరు నిలిచి ఉన్నట్లు గమనించిన కలెక్టర్ నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఆసుపత్రికి కేటాయించిన మెటీరియల్ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమాల్లో ర. భ. ఈఈ భీమ్లా, డిఈ నాగేశ్వరావు, ఆసుపత్రుల సమన్వయ అధికారి ముక్కంటేశ్వరావు, పర్యవేక్షకులు సరళ, ఆర్ఎస్ఐఓ రవిబాబు, టిఎస్ఐఐసి జోనల్ మేనేజర్ రాథోడ్, డిప్యూటీ జియం సంతోష్ కుమార్, ఏఈ మధుకర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.