డిసెంబర్ 8 వరకు క్రొత్త ఓటరుగా నమోదు, చేర్పులకు అవకాశం:: జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ అదిత్య. 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి.

డిసెంబర్ 3, 4 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ లెవెల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక నమోదు కార్యక్రమం.

ఫారం-6 నింపి క్రొత్త ఓటరు గా నమోదు, 6బి తో ఆధార్ లింక్ చేసుకోవాలి.

ఫారం -8 నింపి ఓటర్ కార్డ్ లో మార్పులు, సవరణలు చేసుకోవాలి.

www.nvsp.in, ceo.telangana.nic.in వెబ్సైట్ ద్వారా, Voter Help Line App ద్వారా ఆన్లైన్ లో నమోదుకు అవకాశం.

ఇక పై 3 నెలలకు ఒకసారి ఓటరు జాబితా అప్ డేట్.

ఓటరు జాబితా పై సంబంధిత అధికారులతో సమిక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్.

**
డిసెంబర్ 8 వరకు నూతన ఓటరు నమోదు, డ్రాఫ్ట్ జాబితా లో మార్పులకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ అదిత్య తెలిపారు.

మంగళవారం తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ వై వి గణేష్, ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయ స్వీప్ కన్సల్టెంట్ భవాని శంకర్ లతో కలిసి ఓటరు జాబితా రూపకల్పన పై సమిక్ష నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటరు జాబితా లో గల అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదు క్లెయిమ్స్ కు సంబంధించి దరఖాస్తులను డిసెంబర్ 8 వరకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో తెలుపవచ్చని అన్నారు. జిల్లాకు వచ్చిన అభ్యంతరాలు, నూతన ఓటరు దరఖాస్తులను డిసెంబర్ 26 లోపు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

18 సంవత్సరాలు నిండిన వారిని నూతన ఓటరుగా నమోదుకు విస్తృత ప్రచారం కల్పించి ఎక్కువ మంది ఓటరుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగంగా జిల్లాలో ప్రతి డిగ్రీ కళాశాల స్థాయిలో ప్రత్యేక అధికారులను కేటాయించి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి నమోదు చేయాలని తెలిపారు.

ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా సెక్స్ వర్కర్ల జాబితా, ట్రాన్స్ జెండర్ జాబితా, దివ్యాంగుల జాబితా ప్రత్యేకంగా తయారు చేయాలని అన్నారు. హెచ్.ఐ.వి నియంత్రణకు పని చేస్తున్న స్వచ్చంద సంస్థలు, జిల్లా వైద్య శాఖ వద్ద ఉన్న సెక్స్ వర్కర్ల జాబితా అందజేయాలని, ట్రాన్స్ జెండర్ ల జాబితా ను జిల్లా సంక్షేమ అధికారి అందజేయాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో అందిస్తున్న దివ్యాంగుల ఆసరా పెన్షన్, సదరం సర్టిఫికెట్ ల దరఖాస్తుల నుంచి దివ్యాంగులను గుర్తించి వివరాలను ఓటరు జాబితాలో మ్యాప్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఓటరు జాబితా ఇక పై ప్రతి సంవత్సరం 4 సార్లు 3 నెలలకు ఒకసారి అప్ డేట్ అవుతుందని , జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ 1 తేది నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తున్నామని అన్నారు.

గ్రామస్థాయిలో పట్టణ ప్రాంతంలో అధికారులను భాగస్వామ్యం చేస్తూ ఓటరు నమోదు పై విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని, ఓటరు నమోదు కోసం ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాల పై టాం టాం నిర్వహిస్తున్నామని తెలిపారు.

గ్రామాలలో, పట్టణాలలో 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి వారి వివరాలను సేకరించి సంబంధిత ఫారాన్ని నింపి అప్లోడ్ చేయించాలని ఆదేశించారు.

జాబితా నుండి పేర్లు తొలగించే సందర్భంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడైనా ఒక ఓటరును ఓటరు జాబితా నుండి తొలగించాల్సి వస్తే సంబంధిత ఇంట్లో ఒకరితో ఫామ్ -7 పై సంతకం తీసుకున్న తర్వాతనే తొలగించాలని, అదేవిధంగా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లిపోయిన ఓటర్ల తొలగింపు విషయంలో తప్పనిసరిగా ధృవీకరణ పత్రం ఆధారంగా మాత్రమే వారి ఓటును తొలగించాలని ఆదేశించారు.

జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, ప్రతి వారం ఓటరు నమోదు, తొలగింపు వివరాలను రాజకీయ పార్టీలకు అందచేయాలని కలెక్టర్ సూచించారు.

పట్టణ ప్రాంతంలోని ముఖ్య ప్రాంతాలు, బస్టాండ్ లలో ఓటరు నమోదు, ప్రత్యేక ఓటర్ శిబిరాల పై అవగాహన కల్పించేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమం, స్వీప్ యాక్టివిటీస్ వివరాలు ప్రతిరోజు జిల్లా వెబ్ సైట్ లో, సామాజిక మాధ్యమాల్లో ఉంచాలని చేయాలని కలెక్టర్ సూచించారు.

సీఈఓ స్వీప్ నోడల్ కన్సెల్టెంట్ భవాని శంకర్ మాట్లాడుతూ, ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసు పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నదని, 17 ఏళ్ల వయసు పై బడిన పౌరులు ఓటర్ కార్డు కోసం ముందుగానే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. యువకులు 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడనవసరం లేకుండా, ఇప్పటివరకు జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటరు జాబితాలో నమోదుకు అర్హులు కాగా తాజా నిర్ణయంతో 17 ఏళ్ల వారందరికీ అవకాశం కల్పించినట్లు తెలిపారు.

సెక్స్ వర్కర్ల, ట్రాన్స్ జెండర్ ల ఓటరు నమోదు పై ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న బూత్ స్థాయి అధికారులకు ఓటర్ నమోదుకు సంబంధించి సంపూర్ణ అవగాహన ఉండే విధంగా శిక్షణ అందించాలని తెలిపారు. జాబితా నుంచి ఓటర్ తొలగింపు ప్రక్రియ కట్టుదిట్టంగా అమలు చేయాలని, పట్టణ ప్రాంతాలలో మరింత వినూత్న పద్ధతులను అవలంబిస్తూ ఓటర్ నమోదు కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు.

అంతకుముందు అదనపు కలెక్టర్ వై వి గణేష్, డిఆర్ఓ రమాదేవి ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయ స్వీప్ కన్సల్టెంట్ భవాని శంకర్ కు శాలువాతో సత్కరించి పూల గుచ్చం అందించారు.

ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏవో ఏ భాస్కర్,
డి డబ్ల్యు ఓ ప్రేమలత, డి పి ఆర్ ఓ రఫిక్, ఈ డిస్టిక్ మేనేజర్ దేవేందర్,ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post