డెంగ్యూ వ్యాధి నివారణకు చర్యలు చేపట్టండి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 18, 2021ఆదిలాబాదు:-

డెంగ్యూ వ్యాధి నివారణకు కార్యాచరణ ప్రణాళికలతో వైద్యం, పంచాయితీ, మున్సిపల్, తదితర శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యం, పంచాయితీ, మున్సిపల్, మెప్మా, గ్రామీణ నీటి సరఫరా, తదితర శాఖల అధికారులతో డెంగ్యూ వ్యాధి నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 68 డెంగ్యూ వ్యాధి కేసులు నమోదు అయినట్లు సమాచారం ఉందని, రాష్ట్ర స్థాయి అధికారులు సమీక్ష నిర్వహించిన మేరకు జిల్లాలో వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారని తెలిపారు. జిల్లాలో ప్రతి మంగళ, శుక్ర వారాలలో డ్రై డే కార్యక్రమాలను నిర్వహించాలని, నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు, ఫాగింగ్, స్ప్రేయింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఇట్టి కార్యక్రమాలను మండల పరిషత్ అధికారులు, మున్సిపల్ వార్డు అధికారులు, నిరంతర పర్యవేక్షణ చేపట్టి నివేదికలు సమర్పించాలని అన్నారు. నీటి నిల్వల ప్రాంతాలను గుర్తించి మ్యాపింగ్ చేయాలనీ, అట్టి మ్యాపింగ్ ఆధారాల మేరకు పారిశుధ్య సిబ్బంది, తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ప్రజలకు పరిశుభ్రత, ఆరోగ్యం, డ్రై డే వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించాలని, అదేవిధంగా చెత్త సేకరణ బండ్ల ద్వారా అనౌన్స్ మెంట్ నిర్వహించే విధంగా ఏర్పాట్లు ప్రారంభించాలని అన్నారు. మెడికల్ టీమ్ ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని, జ్వరం బారిన పడిన వారి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేసి వ్యాధిని గుర్తించి తగిన వైద్య సహకారం అందించాలని అన్నారు. ఆశ వర్కర్లు, ఐకేపీ సిబ్బంది, సూపర్ వైజర్లు, తదితర సిబ్బంది ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. గిరిజన ప్రాంతాలలో హై రిస్క్ గ్రామాలను గుర్థించి వైద్య సేవలను అందించాలని అన్నారు. గిరిజనులకు అర్థం అయ్యే విధంగా స్థానిక బాషలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో మున్సిపల్, మెప్మా, విద్య సిబ్బంది వార్డులోని ప్రజలకు ఆరోగ్యం పై విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. ఉట్నూర్ లో పందుల బెడద నివారించడానికి పందుల పెంపకం దారులతో మాట్లాడి గ్రామానికి దూర ప్రాంతానికి తరలించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అంతకు ముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ డెంగ్యూ వ్యాధి సోకినా గ్రామాల మండల పరిషత్ అధికారులతో సమీక్షిస్తూ తీసుకోవలసిన చర్యలపై సూచనలు జారీ చేశారు. ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అధికారులు గ్రామాలలో ఉదయం 7 గంటలకు హాజరై శానిటేషన్ పనులను పర్యవేక్షించాలని అన్నారు. పంచాయితీ కార్యదర్శులకు తగిన ఆదేశాలు జారీ చేస్తూ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన చర్యలు వివరించాలని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, జిల్లాలో 68 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని, ఇందులో 57 శాతం పట్టణ ప్రాంతంలో, 43 శాతం గ్రామీణ ప్రాంతంలో గుర్తించడం జరిగిందని అన్నారు. పారిశుధ్య కార్యక్రమాలు పూర్తీ స్థాయిలో నిర్వహించడం, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పించడం ద్వారా వ్యాధి నివారణ చేయవచ్చని అన్నారు. జిల్లా మలేరియా అధికారి డా.శ్రీధర్ మాట్లాడుతూ, నీటి నిల్వలను గుర్తించి ఆయిల్ బాల్స్ వేయడం, ప్రతి రోజు ఫాగింగ్ ఉదయం, సాయంత్రం నిర్వహించడం ద్వారా డెంగ్యూ వ్యాధి తగ్గు ముఖం పడుతుందని అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ మాట్లాడుతూ, ఐకేపీ సిబ్బంది ద్వారా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అంటూ వ్యాధులు ప్రభల కుండా అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ సమావేశం లో జడ్పీ సీఈఓ గణపతి, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్ శైలజ, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డా.మనోహర్, డా.సాధన, RWS ఎస్ఈ వెంకటేశ్వర్లు, మండల పరిషత్ అధికారులు, మెప్మా, మున్సిపల్, మెడికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post