డ్రై డేను ఖచ్చితంగా పాటించాలి :: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రచురణార్థం

ఖమ్మం, జూలై 23:

సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా డ్రై డే ను ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం కలెక్టర్ కలెక్టరేట్ లో డ్రై డే నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టర్ స్వయంగా కలెక్టరేట్ ఆవరణ అంతా కలియతిరుగుతూ నీటి నిల్వలను తొలగించి, పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. భవనాల స్లాబులపై తనిఖీలు చేసి, ఉపయోగంలో లేని వస్తువులలో నీటి నిల్వలను తొలగించారు. ఉపయోగంలో లేని వస్తువుల ఖండనం చేసి, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి కార్యాలయంలో అధికారులు ముందుండి డ్రై డేను చేపట్టాలని, కార్యాలయాల లోపల, చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, నిల్వ నీరు ఎక్కడా లేకుండా చూడాలని అన్నారు. పగటిపూట మాత్రమే కుట్టే ఎడిస్ ఈజిప్ట్ దోమ వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని ఆయన తెలిపారు. పాత టైర్లు, మురుగు కాల్వలు, కొబ్బరిచిప్పలు, ఎయిర్ కూలర్లు, డ్రమ్ములు, బకెట్లు, బిందెల్లో ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచడం వల్ల అందులో లార్వా పెరిగి దోమలు వ్యాప్తి చెందుతాయన్నారు. వర్షాలు పడుతున్నందున దోమలు పెరిగి, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. దోమల నియంత్రణతో వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టవచ్చని ఆయన అన్నారు. వర్షాకాలం కావడంతో దోమల వృద్ధితో డెంగీ, మలేరియాకి గురవుతారని ఆయన అన్నారు. నీరు నిలిచే ప్రదేశాల్లో దోమల లార్వాలను చంపే ఆయిల్‌ బాల్స్‌ను విడుదల చేయాలన్నారు. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, ఫినాయిల్‌, మలాథీన్‌లతో పాటుగా ఫాగింగ్‌ చేపట్టాలన్నారు. పరిశుభ్రతను ప్రతిఒక్కరూ బాధ్యతగా గుర్తెరిగి నడవాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా రెవిన్యూ అధికారిణి శిరీష, కలెక్టరేట్ ఏవో మదన్ గోపాల్, సిబ్బంది శ్రీనివాసరావు, రంగ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share This Post