తమ జిల్లాలో వంద శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి అయ్యే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీష్ రావు జిల్లా కలెక్టర్లను సూచించారు

తమ జిల్లాలో వంద శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి అయ్యే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీష్ రావు జిల్లా కలెక్టర్లను సూచించారు. శనివారం వ్యాక్సినేషన్, కొత్త మెడికల్, నర్సింగ్ కళాశాలల ఏర్పాటు పై జిల్లా కలెక్టర్లు, వైద్య అధికారులు, ఆర్ అండ్ బి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రాంతాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేసేందుకు పకడ్బందీగా పర్యవేక్షణ నిర్వహించాల్సిన అవసరం ఉందని కలెక్టర్లను సూచించారు.  ఆశా వర్కర్ నుండి మెడికల్ ఆఫీసర్ వరకు సరియైన పర్యవేక్షణ  ద్వారా  వంద శాతం వ్యాక్సిన్ పూర్తి చేయాలన్నారు. ఇల్లిల్లు తిరిగి ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా పూర్తి గణాంకాలు సేకరించాలన్నారు.  మొదట వంద శాతం పూర్తి చేసిన జిల్లాకు స్వయంగా వచ్చి ప్రశంసా పురస్కారం అందజేస్తామని తెలిపారు.

అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు పై పకడ్బందీగా పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.   ప్రతి పి.హెచ్.సి లో వైద్యులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉపస్థితి ఉంది విధులు నిర్వర్తించాలన్నారు.  సి.హెచ్.సి., ఏరియా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు ఉదయం 9 నుండి 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు ఆసుపత్రిలో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ.పి లు ఎందుకు తక్కువ ఉన్నాయో కలెక్టర్లు, వైద్యాధికారులు పర్యవేక్షించాలన్నారు.  ఆసుపత్రిలో ఇచ్చే భోజనం నాణ్యత, పారిశుథ్యం  పై కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. పారిశుధ్య కాంట్రాక్టర్ల పనితీరును పరిశీలించాలని సూచించారు.  ఆసుపత్రికి కావాల్సిన అన్ని మౌళిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని,  ఇక నుండి ప్రతినెలా తమ పనితీరులో గణనీయమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.  శస్త్ర చికిత్సలు పెంచాలని, ప్రజలు ప్రయివేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల పై భరోసా కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.  ఆరోగ్య శ్రీ సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించాలని తద్వారా ఆసుపత్రికి ఆదాయం వస్తుందన్నారు.  ఆయుషుమాన్ భారత్ ద్వారా మరో 646 చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని వాటిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించి ఆదాయం పొందాలన్నారు.  ఆసుపత్రికి వచ్చే వారిని వైద్య సిబ్బంది  ప్రేమ ఆప్యాయతతో పలకరించాలని ఆదేశించారు. జిల్లాలో పనిచేస్తున్న  ఆర్.బి.ఎస్.కె., ప్రభుత్వ యునాని, ఆయుర్వేద, హోమియోపతి విభాగాల పనితీరును పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు.  ప్రతి ఆసుపత్రిలో మరుగుదొడ్ల నుండి ఆపరేషన్ థియేటర్ వరకు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని ఇక నుండి తాను, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తరచుగా ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రి, మెడికల్ కళాశాల పురోగతి పై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో 210 పడకల పెంపు కార్యక్రమం సకాలంలో పూర్తి చేయాలని, త్వరగా ట్రెస్ లు తెప్పించి బిగించే విధంగా చర్యకు చేపట్టాలన్నారు.  నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నెలరోజుల్లో పూర్తి అయేవిధంగా చర్యలు తీసికోవలన్నారు.  ఆలస్యమైతే మెడికల్ కళాశాల విద్యార్థులను ఈ సంవత్సరం కేటాయింపు జరుగకపోయే ప్రమాదం ఉందన్నారు.

వర్చువల్ ద్వారా పాల్గొన్న  జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ స్పందిస్తూ ఆసుపత్రిలో పడకల పెంపు పనులు  వారం పాటు ఆలస్యంగా నడుస్తుందని నిర్ణిత గడువులో పూర్తి చేయిస్తానని అన్నారు.  నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులు సైతం గడువు లోపల పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.  ఆసుపత్రుల పర్యవేక్షణలో సూచనలు పాటిస్తామని తెలియజేసారు.

 

అదనపు కలెక్టర్ మను చౌదరి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుధాకర్ లాల్, ఆర్.అండ్ బి ఈ.ఈ భాస్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share This Post