జనగామ, జూలై 26: తమ ప్రభుత్వం శాశ్వత పథకాల ప్రభుత్వమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. సోమవారం మంత్రి పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కె. నిఖిల తో కలిసి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం శాశ్వత పథకాలపైనే దృష్టి పెడుతుందని, అందుకోసం ప్రజల కోసం నిరంతరం తపించే ప్రభుత్వం తమదను అన్నారు. రాష్ట్రంలో 90 లక్షల 50 వేల రేషన్ కార్డులు ఉండగా, క్రొత్తగా రేషన్ కార్డుల కొరకు 4 లక్షల 16 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలలో ఒక వేయి326 క్రొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. కొత్త రేషన్ కార్డులు పొందలేని వారికి మరొక అవకాశం కల్పించడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు. అదేవిధంగా పింఛన్లు, రెండు పడక గదుల ఇండ్లు కూడా ఇవ్వాల్సి ఉందని బడ్జెట్లో ప్రవేశపెట్టామని అన్నారు. దళితుల అభ్యున్నతికి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చే పథకం ప్రవేశపెట్టామని త్వరలో లబ్ది దారులను ఎంపిక చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఒక లక్ష 37 వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మాత్యులు సహకారంతో 15 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీల లో వచ్చే విధంగా కృషి చేశామన్నారు. కరోనాతో ఇబ్బందులు ఉన్న రాష్ట్రం అప్పు తెచ్చి పథకాలు కొనసాగించింది అని గుర్తు చేశారు. తాగునీటి పథకంలో భాగంగా 40 వేల కోట్లతో గోదావరి నీటిని మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి అందించామన్నారు. 24 గంటలు విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా రైతులకు ఉచిత విద్యుత్తు కూడా ఇస్తున్నమన్నారు. 6 కోట్లతో మోడల్ మార్కెట్ నిర్మాణం చేపట్టామని, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్, పల్లె పట్టణ ప్రకృతి వనాలతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. గత రెండు సంవత్సరాలుగా జ్వరాల నియంత్రణ దేశంలోనే తెలంగాణకు పేరు తెచ్చిపెట్టిదని అన్నారు. హాస్పిటల్స్ అభివృద్ధి పరచి అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేసి నిరుపేదలకు అందుబాటులో ఉంచామన్నారు. 40 లక్షలతో ఆనందయ్య మందును ఇంటింటికి పంపిణీ చేశామన్నారు. వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం అంతర్జాతీయ స్థాయి కీర్తి నార్జించినదని తెలియజేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. నిఖిల మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికి లక్షా 58 వేల 317 రేషన్ కార్డులు ఉండగా, క్రొత్తగా 4 వేల 580 కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటికి కేటాయింపు 3176.996 మెట్రిక్ టన్నుల బియ్యానికి అదనంగా పెరిగిన రేషన్ కార్డులకు 70.464 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపులు పెరిగాయన్నారు. కొత్త రేషన్ కార్డుల వినియోగదారులకు ఆగస్టు నెల నుండి బియ్యం పంపిణీ జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిసి బ్యాంకు వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, స్టేషన్ ఘనపూర్ ఆర్డీవో కృష్ణవేణి, డిసిఎస్వో ఎం. రోజారాణి, డిఎం సివిల్ సప్లైస్ సంధ్యా రాణి, మూడు మండలాల తహశీల్దార్లు, ఎంపిపిలు, జెడ్పిటిసిలు, సర్పంచులు, ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.