తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలని, ఇందిరా నగర్ మరియు మన్నెంపల్లి, చిగురుమామిడి మండల కేంద్రం లోని రేషన్ షాప్,అంగన్వాడి కేంద్రం మరియు ఉన్నత ప్రాథమిక పాఠశాల ను పరిశీలించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి పాల్గొన్న ఫుడ్ కమిషన్ సభ్యులు భారతి. (కరీంనగర్ జిల్లా)

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి

రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ కె.తిరుమల్ రెడ్డి

కమిషన్ సభ్యులతో కలిసి అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, రేషన్ షాపులను పరిశీలించిన చైర్మన్
00000

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని, అబ్దిదారులకు పథకాల ఫలాలు సక్రమంగా అందేలా చూడాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ కె.తిరుమల్ రెడ్డి అన్నారు.

మంగళవారం ఆహార కమిషన్ సభ్యురాలు ఎం. భారతితో కలిసి తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ, ఇందిరా నగర్, మన్నెంపల్లి, చిగురుమామిడి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలను, జడ్.పి.హెచ్.ఎస్, మండల ప్రాథమికోన్నత పాఠశాల లను సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలకు, బాలింతలకు అందజేస్తున్న పోషకాహారం, కోడిగుడ్లు, పిల్లలకు అందిస్తున్న ఆహారం, గర్భిణులు, చిన్నారులకు గల రక్తహీనత తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం అన్నం, పప్పు, కోడిగుడ్లు అందిస్తున్న వివరాలను తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల తో మాట్లాడారు. చిగురుమామిడి మండలం లో చౌక ధరల దుకాణం పరిశీలించారు. తెలుపు రేషన్ కార్డు గల వారికి అందజేస్తున్న బియ్యం వివరాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆహార కమిషన్ చైర్మన్ కె.తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం కరీంనగర్ జిల్లాలో అమలు తీరును పరిశీలించేందుకు సభ్యులతో కలిసి జిల్లా కు వచ్చామని తెలిపారు. కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, గోవర్ధన్ రెడ్డి, శారద ఒక బృందంగా కరీంనగర్, చొప్పదండి మండలాలలో పర్యటించి అమలు తీరును పరిశీలించిందని అన్నారు. కమిషన్ సభ్యురాలు ములు గంటి భారతితో కలిసి తాను తిమ్మాపూర్ చిగురుమామిడి మండలాల్లో అమలు తీరును పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆహార భద్రత చట్టం 2013 అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. గర్భిణీకు, బాలింతలు, అంగన్ వాడీ చిన్నారులు వారి తల్లులు, మధ్యాహ్న భోజనం పై విద్యార్థులతో మాట్లాడానని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం మేనూ ప్రకారం అమలు చేయాలని, కోడి గుడ్లు లేకున్నా, బియ్యం రాకున్నా, సరుకులు సరిగా లేకున్నా నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని విద్యాశాఖ అధికారులను, తాసిల్దార్, ఎంపీడీవో కు సూచించారు. చట్టంపై ప్రభుత్వం అందజేస్తున్న పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరారు. గ్రామాల్లో ఎన్జీవోలు, యూత్ కమిటీ లు బాధ్యత వహించి పథకాలు అమలు అయ్యేలా చూడాలని అన్నారు. ఆహార భద్రత ప్రభుత్వ సంక్షేమ పథకం అని, చట్టపరమైన హక్కులకు భంగం కలగకుండా చూడాలని తెలిపారు. వంట ఏజెన్సీలకు నెలవారీగా వేతనాలు క్రమం తప్పకుండా అందించేందుకు ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. రేషన్ షాపుల్లో అవకతవకలు జరగకుండా విజిలెన్స్ కమిటీలు చూడాలని, ఏమైనా పొరపాట్లు జరిగితే కేస్లు రిజిస్టర్ చేసి నివేదిక అందించాలని అన్నారు. ఆహార భద్రత పకడ్బందీగా అమలు చేయడం కోసం కమిషన్ పనిచేస్తుందని తెలిపారు. ఆహారభద్రత కార్డులు అందని వారికి అందించాలని, అవసరం లేని వారు కార్డులను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇవ్వాలని అన్నారు. రేషన్ డీలర్లు సరుకులను సక్రమంగా తూకం చేయాలని, లబ్ధిదారులతో మర్యాదగా నడుచుకోవాలని అన్నారు. రేషన్ షాపులకు రాలేని వృద్ధులకు ఇంటివద్దే రేషన్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గర్భిణీలకు కెసిఆర్ కిట్లు అందించాలని, వారికి ప్రభుత్వం అందజేసే పథకం డబ్బులు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ ఎంపీడీవో రవీందర్ రెడ్డి, తాసిల్దార్ రాజ్ కుమార్, ఎం.పి ఓ కిరణ్ కుమార్, సర్పంచ్ మీసాల అంజయ్య, సిడిపిఓ సబితా, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేష్ రెడ్డి, ఇందిరానగర్ సర్పంచ్ వినోద, మన్నెంపల్లి సర్పంచ్ మేడి అంజయ్య, ఉప సర్పంచ్ అనిల్ గౌడ్, చిగురుమామిడి మండలం ఎంపిపి కొత్త వినీత, సర్పంచ్ లక్ష్మణ్, తాసిల్దార్ మోబిన్ అహ్మద్, రేషన్ డీలర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

పౌరసరఫరాల సంస్థ గోదాం పరిశీలన:

తిమ్మాపూర్ మండలం లోని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మండల స్థాయి గోదాం ను మంగళవారం రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి సభ్యులు ఓరుగంటి ఆనంద్, ములుకుంట్ల భారతి, గోవర్ధన్ రెడ్డి, శారదలతో కలిసి పరిశీలించారు. గోదాం లో ఉన్న బియ్యం నిల్వల గురించి జిల్లా పౌరసరఫరాల అధికారి సురేష్ రెడ్డి, జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి లను అడిగి తెలుసుకున్నారు. రా రైస్, దొడ్డు బియ్యం, సన్న బియ్యం నిల్వలను పరిశీలించారు. హమాలీ కార్మికుల తో మాట్లాడారు.

 

Share This Post