ప్రచురణార్ధం
సెప్టెంబరు, 21 ఖమ్మం:
తెలంగాణకు హరితహారం కింద జిల్లాలో రాబోయో సంవత్సరానికి 50 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో 90.90 లక్షల మొక్కలను నర్సరీలలో ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి.గతమ్ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి మానిటరింగ్, కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో తెలంగాణకు హరితహారం 2021 2022 పురోగతిని, 2022 లక్ష్యాలపై సంబంధిత జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం 50 లక్షల మొక్కలు నాటే లక్ష్యానికి గాను 44.6 లక్షల మొక్కలు. నాటడం జరిగిందని నాటిన ప్రతి మొక్క సజీవంగా ఉండేలా సంరక్షణ చర్యలు ఉండాలని ప్రధానంగా ఎవెన్యూ ప్లాంటేషన్ సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధితో పాటు గ్రామీణ ప్రాంతాలలో విరివిగా ఎవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగిందని, భవిష్యత్తులో ప్రజలకు నీడనిచ్చే చెట్లుగా ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుందనే విషయాన్ని ప్రజలను అవగాహనపర్చి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం నగర ప్రవేశ, నగరం నుండి బయటకు వెళ్ళే ప్రధాన మార్గాలు మరింత పచ్చదనంతో ఆకర్షణీయంగా ఉండేలా ఎవెన్యూ ప్లాంటేషన్ సంరక్షణ చర్యలు ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. అటవీ, పంచాయితీ శాఖల అధికారుల సమన్వయంతో సంరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణకు హరితహారం కింద 2020లో జరిపిన ప్లాంటేషన్ జియోట్యాగింగ్ సమగ్ర నివేదికకు సంబంధించిన వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఖమ్మం నగరపాలక 7 లక్షల 78 వేల లక్ష్యానికి గాను 6 లక్షల 76 వేలు, మధిర మున్సిపాలిటీ 1 లక్షకు గాను 92 వేల 976, వైరా మున్సిపాలిటీ 83 వేల లక్ష్యానికి గాను 76 వేలు అదేవిధంగా సత్తుపల్లి మున్సిపాలిటీ 1 లక్ష 24 వేల లక్ష్యానికి గాను 1 లక్షా 9 వేల పురోగతి సాధించాయని, వీటన్నిటికి జియోట్యాగింగ్ క్రమపద్ధతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీనితోపాటు జిల్లాలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ప్రజలకు వినియోగంలో ఉండేలా నిర్వహణ చర్యలు ఉండాలని కలెక్టర్ సూచించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలకు గాను ఇంకనూ జిల్లాలో ప్రభుత్వ స్థలాల గుర్తింపు ప్రక్రియలో జాప్యం జరుగకుండా సత్వర చర్యలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ప్రయివేటు స్థలాల్లో ఉన్న నర్సరీలను ప్రభుత్వ స్థలంలోకి మార్చాలని, పల్లె ప్రకృతి వనాలలో ఎట్టి పరిస్థితులలో నర్సరీల నిర్వహణ ఉండరాదని కలెక్టర్ ఆదేశించారు. నర్సరీల నిర్వహణను ప్రభుత్వ, ఎన్.ఎస్.పి. స్థలాలను గుర్తించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో డిమాండుకు అనుగుణంగా నర్సరీలలో మొక్కలు పెంచాలన్నారు. ఈ సంవత్సరంకు ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని కనీసం 10 వేల ఎకరాలకు తగ్గకుండా పెంచాలని కలెక్టర్. సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూధన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర సురభి, జిల్లా అటవీ శాఖాధికారి బి. ప్రవీణ, జిల్లా గ్రామీణాభివృద్ధి విద్యాచందన, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, జిల్లా పంచాయితీ అధికారి ప్రభాకర్ రావు, జిల్లా ఉద్యానవన శాఖాధికారి అనసూయ, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరీ, వ్యవసాయ శాఖ ఏ.డి సరిత, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.